అలస్కాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ

అలస్కాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ


అలస్కా: ఉత్తర అమెరికాలోని అలస్కా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ ప్రాంతంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీచేశారు. అలస్కాకు సమీపంలో 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్జీఎస్ పేర్కొంది. అలస్కా ద్వీపం, అలేటియన్ దీవులు, కుక్ ఇంటెల్ ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అలస్కా భూకంప కేంద్రం పేర్కొంది. భూకంప క్రియాశీలక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌‌లో అలస్కా కూడా ఓ భాగం. అలస్కాపై 1964 మార్చిలో 9.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం విరుచుకుపడింది. ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకూ రికార్డయిన అతి శక్తివంతమైన భూకంపం ఇదే. ఈ భూకంపం కారణంగా సంభవించి సునామీ.. అలస్కాతో పాటు అమెరికా పశ్చిమ తీరం, హవాయిలలో పెను విధ్వంసం సృష్టించింది. నాటి సునామీ 250 మందికిపైగా పొట్టనబెట్టుకుంది.