కర్నాటకలో  బీజేపీ- జేడీఎస్ పొత్తు  ?  

కర్నాటకలో  బీజేపీ- జేడీఎస్ పొత్తు  ?  
  • చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి
  • జేడీఎస్ నేత కుమారస్వామి

బెంగళూరు :  కర్నాటకలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయింది. కాంగ్రెస్ భారీ విజయంతో విపక్షంగా మారిన బీజేపీతో పాటు జేడీఎస్ కూడా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ దిశగా చర్చలు కూడా ప్రారంభించాయి. అయితే ఇవాళ అనూహ్యంగా జేడీఎస్ నేత కుమారస్వామి బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశాన్ని తోసిపుచ్చారు. కానీ చర్చలు జరుగుతున్నట్లు మాత్రం అంగీకరించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు వస్తున్న వార్తలను జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్‌డి కుమారస్వామి  ఆదివారం  తోసిపుచ్చారు. చర్చలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని, ఇంకా చాలా చర్చలు జరగాల్సి ఉందన్నారు. తాజాగా జేడీఎస్ తో పొత్తుపై బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కుమారస్వామి స్పందించారు. జేడీఎస్ తో ఒప్పందం అమల్లో ఉన్నట్లు తాజాగా యడియూరప్ప వ్యాఖ్యానించారు. యడ్యూరప్ప స్పందన ఆయన వ్యక్తిగతమని కుమారస్వామి తెలిపారు. ఇప్పటి వరకు సీట్ల పంపకాలతో పాటు మరే ఇంతర అంశాలపైనా చర్చ జరగలేదన్నారు. తాము మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. ఇవి ప్రారంభ దశల చర్చలు మాత్రమే అన్నారు. యడియూరప్ప జేడీఎస్ గురించి మంచిగా మాట్లాడారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. అలాగే మాండ్య లోక్ సభ సీటులో పోటీపై జేడీఎస్ పట్టుదలగా ఉన్నట్లు వస్తున్న వార్తల్ని కూడా కుమారస్వామి తోసిపుచ్చారు.