రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే  అధికారం లోక్‌సభ సెక్రెటేరియట్‌కు లేదు

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే  అధికారం లోక్‌సభ సెక్రెటేరియట్‌కు లేదు
రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.  కేరళలోని వయనాడు‌కు ప్రాతినిధ్యం  వహిస్తున్న  రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ విడుదల కాగానే కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికే దుర్దినం అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. తాము న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని జైరాం రమేశ్ అన్నారు. కాగా, అసలు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే అధికారం లోక్‌సభ సెక్రెటేరియట్‌కు ఉండదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మనీశ్ తివారీ అన్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే ప్రక్రియపైనా కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది.
లోక్‌సభ సెక్రెటేరియట్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు విధించలేరని స్పష్టం చేశారు. ఒక ఎంపీపై అనర్హత వేటును రాష్ట్రపతి.. ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపి వేస్తారని వివరించారు. వాస్తవాలను మాట్లాడేవారిని బీజేపీ కోరుకోదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అందుకే రాహుల్ గాంధీని టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం జైలుకైనా వెళ్లడానికి సిద్ధం అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిని ఈ ఘటన వెల్లడిస్తుందని కేసీ వేణుగోపాల్ అన్నారు.  రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు సంబంధించిన ప్రక్రియ వేగాన్ని చూసి తాను స్టన్ అయ్యానని శశిథరూర్ పేర్కొన్నారు. తీర్పు వెలువడిన 24 గంటల్లో అనర్హత వేటు వేశారని వివరించారు. ఇంకా ఈ తీర్పుపై అప్పీల్ చేయాల్సి ఉన్నదనీ గుర్తు చేశారు. ఇవి దాడులకు సిద్ధమైన రాజకీయాలు అని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు అని ట్వీట్ చేశారు.