ప్రతిపక్షాల అవినీతి  20 లక్షల కోట్లు!

ప్రతిపక్షాల అవినీతి  20 లక్షల కోట్లు!
  • ముస్లింలను రెచ్చగొడుతున్నది వారే
  • త్వరలోనే వారి భరతం పడతా
  • భోపాల్ పర్యటనలో ప్రధాని మోడీ
  • ఐదు వందేభారత్​రైళ్లు ప్రారంభం 

భోపాల్: దేశంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి సుమారు రూ.20 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, డీఎంకే, టీఎంసీ పార్టీలు అవినీతికి కేరాఫ్ పార్టీలని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అవినీతి పార్టీలను తరిమి కొట్టాలని, కుటుంబ పాలన కొనసాగిస్తున్న రాజకీయ పార్టీల నుంచి ప్రజలకు విముక్తి  కల్పించాలని ప్రధాని పేర్కొన్నారు. మీ భార్య, పిల్లల భవిష్యత్​ బాగుండాలంటే అవినీతిపై గ్యారంటీ ఇస్తున్న పార్టీలకు ఓట్లు వేయకూడదని, బీజేపీకే ఓటేయాలని కోరారు. మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుంచి 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి మోడీ ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా, 3 రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. వాటిలో భోపాల్-– ఇండోర్, భోపాల్-– జబల్పూర్, గోవా– -ముంబై, హతియా-– పాట్నా, బెంగళూరు – -హుబ్లీ రైళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ప్రతిపక్షాలు దేశంలోని  వెనకబడిన ముస్లిం వర్గాలను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందుతున్నాయన్నారు. ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెబుతామని పేర్కొన్నారు. 

అన్ని పనుల్లోనూ అవినీతే..

దేశంలో కాంగ్రెస్​బొగ్గు స్కామ్, 2జీ స్కామ్, కామన్​వెల్త్​స్కామ్, హెలికాప్టర్ల కొనుగోళ్లలో, సబ్​మెరైన్​కొనుగోళ్లలో ఇలా.. ప్రతీ పనిలోనూ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రధాని ఆరోపించారు. ఆర్జేడీ దాణా కుంభకోణంలో, అల్​కత్రా, పశుపాలన, వరదల స్కామ్​లు, టీఎంసీ 23వేల కోట్ల శారదా, రోజ్​వెరీ, గో తస్కరణల అవినీతి, ఎన్సీపీ 70వేల కోట్ల బ్యాంక్​ల స్కామ్, డీఎంకే, బీఆర్ఎస్​ఇలా మహాఘట్​బంధన్​ పార్టీలన్నీ అవినీతి బురదలో కూరుకున్నవేనని తెలిపారు. త్వరలోనే వీరి భరతం పడతానని ప్రధాని మోడీ హెచ్చరించారు. అనంతరం బూత్​స్థాయి కార్యకర్తలకు పలు విషయాల్లో దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగూభాయ్ పటేల్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు.