తెలంగాణలో మొదటి జిల్లా జైలు సిద్దిపేటకు మంజూరు

తెలంగాణలో మొదటి జిల్లా జైలు సిద్దిపేటకు మంజూరు
  • ఎన్సాన్ పల్లి సమీపన రూ. 78 కోట్లతో నిర్మాణం
  • 425 మంది ఖైదీల సామర్థ్యంతో నూతన జైలు ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: ఇరుకు జైలు కష్టాలు సిద్దిపేట జిల్లాకు ఇక దూరం కానున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాక  రాష్ట్రంలో తొలి నూతన జైలు సముదాయాన్ని ప్రభుత్వం సిద్దిపేటకు మంజూరు చేసింది. ఇప్పటివరకు సిద్దిపేటలో సబ్ జైలు మాత్రమే ఉన్నది. దీంట్లో కేవలం 25 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం కలిగి ఉంది. సిద్దిపేట పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం పక్కన ఇరుకైన స్థలంలోనే ఈ సబ్ జైలు ఉంది. పార్కింగ్ సదుపాయం లేకుండా జైలర్కు, సిబ్బందికి తగిన సదుపాయాలు ఇక్కడ లేకున్నప్పటికీ ఇన్నాళ్లు సర్దుకుంటూ వస్తున్నారు. ఇక జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి చెప్పనక్కర్లేదు ఒకే ద్వారంతో ఉన్న ఈ సభ్ జైలులో ఖైదీల కుటుంబీకులకు మూలాఖత్కు వచ్చే వారికి సౌకర్యాలు ఏమీ లేవు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పది న్యాయస్థానాలు, జిల్లాలో హుస్నాబాద్ లో రెండు న్యాయస్థానాలు, గజ్వేల్లో రెండు న్యాయస్థానాలు, దుబ్బాకలో ఒక న్యాయస్థానం ఉన్నాయి. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసుల్లోని నిందితులను ఆయా ప్రాంతాల్లోని న్యాయస్థానాల్లో నిందితులను రిమాండ్ చేశాక సిద్దిపేట జిల్లా సబ్ జైలుకు తీసుకొస్తారు. వీరందరిని సిద్దిపేట జైల్లో కుక్కడం జరుగుతోంది.

ఈ పరిణామాలన్నింటినీ సీరియస్ గా తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర, ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కొత్త జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అతిపెద్ద జైలు నిర్మాణానికి రాష్ట్ర జైలు శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై కొత్త జైలును మంజూరు చేయించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 78 కోట్ల రూపాయల నిధులను కొత్త జైలుకు మంజూరీప్పించారు. ఈ జైలు సముదాయాన్ని సిద్దిపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న   ఎన్సాన్ పల్లి గుట్టల్లో సర్వే నంబర్ 730లో 34 ఎకరాల విశాలమైన స్థలంలో జిల్లా కొత్త జైలు నిర్మాణం చేపట్టనున్నారు. నూతన జైలు నిర్మాణానికి ఈనెల 20న రాష్ట్ర జైళ్ళ శాఖ డీజీపీ డాక్టర్ జితేందర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ తదితరులతో కలిసి రాష్ట్ర మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఆరు నెలల్లో కొత్త జైలును పూర్తిచేసి అందివ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 

కొత్త జైలుకు 58 మంది సిబ్బంది

సిద్దిపేటలో నూతనంగా నిర్మించే జైలు నిర్వహణ కోసం 58 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది జైలుకు డిప్యూటీ సూపరిండెంట్ పోస్ట్ ఒకటి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఒకరు, జైలల్రు ఇద్దరూ, డిప్యూటీ జైలర్ ఒకరు, చీఫ్ ఎడ్వార్డర్ ఒకటి, హెడ్ వార్డర్లు11 మంది,  వార్డర్లు29 మంది, నలుగురు మహిళా వార్డర్లు, మరో 8 మంది ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఓపెన్ ఏర్ జైల్ 425 మంది కెపాసిటీ

సిద్దిపేట సమీపంలో ఎన్సాన్ పల్లి వద్ద  నిర్మించనున్న ఓపెన్ ఎయిర్ జిల్లా జైలులో 425 మంది ఖైదీలను ఉంచడానికి వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. 34 ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మిస్తున్న ఈ జైలు సముదాయము ఖైదీల సంస్కరణకు నిలయంగా మార్చనున్నారు. ఈ జైలు నిర్మాణం వల్ల ఎన్సాన్ పల్లి  పరిసర ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరగనున్నది.