నేను వెళ్లలే..  కేసీఆర్​వెళ్లగొట్టిండు

నేను వెళ్లలే..  కేసీఆర్​వెళ్లగొట్టిండు
  • బీఆర్ఎస్​తో నాకు ఏ పంచాయితీ లేదు
  • పదవి ఆశించి బీజేపీలో చేరలేదు
  • పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్​
  • కౌశిక్​రెడ్డి నా భర్తను చంపాలని చూశారు 
  • అందుకు రూ.20 కోట్లు ఖర్చు చేశారు : ఈటల జమున
  • ఈటల దంపతులు చెప్పేవన్నీ అబద్ధాలే!
  • ఓడిపోతామనే తనపై ఆరోపణలు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డి
  • హాట్​హాట్​గా హుజూరాబాద్​రాజకీయం

  
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆరోపణలు, ప్రత్యారోపణలతో హుజూరాబాద్​రాజకీయం వేడెక్కింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్​బీఆర్ఎస్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా.. ఈటల సతీమణి జమున.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. కాగా కౌశిక్​రెడ్డి కూడా అదే స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. మంగళవారం హైదరాబాద్​లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్​ఈటల రాజేందర్​మాట్లాడారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోలేదని, సీఎం కేసీఆరే తనను బయటికి వెళ్లగొట్టారని అన్నారు. బీఆర్ఎస్​తో తనకు ఏ పంచాయితీ లేదన్నారు. కేసీఆర్​తనను వెళ్లగొట్టిన నాడు ఆయన కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారని అన్నారు. తనకు ఎవరితోనూ గొడవలేదని, పదవులు ఆశించి బీజేపీలో చేరలేదని పేర్కొన్నారు. 

బీజేపీలో సంతృప్తిగా ఉన్నా..

జీవితంలో పార్టీలు మారడం అంటే చాలా పెద్ద విషయమని ఈటల అన్నారు. బీజేపీలో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని, పార్టీలన్నప్పుడు బేధాభిప్రాయాలు సహజమని, కేసీఆర్​ను ఓడించడమే తన లక్ష్యమని తెలిపారు. తనకు తానుగా ఎప్పుడూ ఢిల్లీ వెళ్లలేదని, పదవి అడగలేదని చెప్పారు. ప్రజలంతా బీఆర్ఎస్​ను ఓడించాలని అనుకుంటున్నారన్నారు. తము పింఛన్​వద్దని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అడుగుతున్నారని, రైతుబందు కాదని.. పండిన పంటకు తగిన ధర కావాలని కోరుతున్నారని ఈటల తెలిపారు. రాష్ట్రంలో కౌలు రైతులు 35 శాతం మంది ఉన్నారని, ఇక్కడ అన్యాయం జరుగుతోందని వారంతా గగ్గోలు పెడుతున్నారని..  కానీ కేసీఆర్​వేరే రాష్ట్రానికి పోయి ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అని అంటున్నారని వెల్లడించారు. కేసీఆర్​అక్రమ సంపాదనకు ధరణితో వేదిక అయ్యిందని, నడ్డా చెప్పినట్టు అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ఈటల తెలిపారు. 
 
హత్య చేసేందుకు కోట్లు ఖర్చు చేశారు : జమున

తన భర్త ఈటల రాజేందర్ ను చంపేందుకు కౌశిక్​రెడ్డి రూ.20కోట్లు ఖర్చు చేశారని ఈటల జమున తెలిపారు. మంగళవారం హైదరాబాద్​లోని తన నివాసంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని విమర్శించారు. తన ఇంట్లో ఎవరికి హాని జరిగినా కేసీఆర్​దే బాధ్యత అని చెప్పారు. తాము పదవుల కోసం పాకులాడలేదని, ఎవరి కాళ్లూ మొక్కలేదని అన్నారు. కేసీఆర్​ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీని చేసి హుజూరాబాద్ మీదకు వదిలిపెట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014 లో కట్టిన అమరవీరుల స్థూపంలో తన పేరు లేదని కౌశిక్​రెడ్డి కూల్చి వేశారని, అమరవీరుల స్థూపం తాకే అర్హత ఆయనకు లేదన్నారు. కౌశిక్​గవర్నర్ ను తిడితే మందలించాల్సింది పోయి సీఎం ఆయనకు పదవులు ఇచ్చారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ హుజూరాబాద్‌ను కౌశిక్ రెడ్డికి అప్పజెప్పాలని చూస్తున్నారని ఈటల పుణ్యంతోనే కౌశిక్ కు ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. తామంతా బీజేపీలో సంతృప్తికరంగా ఉన్నామని జమున వెల్లడించారు.


ఓడిపోతారనే తనపై ఆరోపణలు : ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి

ఈటల ను హత్య చేసేందుకు తాను ప్లాన్​ చేస్తున్నానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్​లో ఆయన మాట్లాడుతూ హత్యకు రూ.20 కోట్లు  ఖర్చు చేశానని చెప్పడం పెద్ద జోక్​అని అన్నారు. హుజూరాబాద్ లో హత్యారాజకీయాలు చేసేది ఈటలే అని,  ఇది చాలాసార్లు రుజువైందన్నారు. ఉద్యమకారుడు బాలరాజు ను చంపించింది ఈటల కాదా..? ప్రవీణ్ కుమార్ ను పోలీసులతో టార్చర్ పెట్టించి, గుండెపోటుతో చనిపోవడానికి కారణం రాజేందర్​కాదా..అని ప్రశ్నించారు. 2018లో ఈటల తనను చంపించేందుకు కుట్ర చేశారని కౌశిక్​రెడ్డి ఆరోపించారు. ఆయన మనుషులు తన కారు అద్దాలు ధ్వంసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈటలే తనను చంపడానికి యత్నిస్తున్నారని, బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు. దంపతులిద్దరూ తన గురించి చెప్పనవన్నీ అబద్ధాలేనని కౌశిక్​రెడ్డి స్పష్టం చేశారు. ఈటలను ఓడించేందుకే తాను రాజకీయాలకు వచ్చానని, ఓడించేదాకా విశ్రమించననని అన్నారు. ఒకప్పుడు ఇల్లు కూడా సరిగా లేని ఈటల.. ఇపుడు 100 కోట్ల ఇల్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు. ఓడిపోతున్నాని తెలిసే ఈటల ఆగమాగం అవుతున్నారని కౌశిక్​రెడ్డి వివరించారు. 

  • ఈటలకు వై కేటగిరి భద్రత
  • నిర్ణయం తీసుకున్న కేంద్ర హోం శాఖ
  • రెండు రోజుల్లో ఉత్తర్వులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ నేత, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈటలను చంపేందుకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి ప్లాన్​చేస్తున్నారని రాజేందర్​తోపాటు ఆయన భార్య జమున మంగళవారం ఆరోపణలు చేశారు. రాజేందర్​కు ప్రాణహాని ఉందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజేందర్​కు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు మంగళవారం రాత్రి కేంద్ర హోం శాఖ వెల్లడించింది. రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం.