24 గంటల కరెంట్ ఎక్కడో చూపించాలి...

24 గంటల కరెంట్ ఎక్కడో చూపించాలి...
  • కాంగ్రెస్ పై బోగస్ ప్రచారం మానుకోక పోతే ఖబడ్దార్...
  • టి.పి.సి.సి కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : వేణుగోపాల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మేడ్చల్:  రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఎక్కడ జరుగుతుందో బిఆర్ఎస్ నాయకులు నిరూపించాలని  టి.పి.సి.సి కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇస్తున్న పది గంటల కరెంట్ లో పది సార్లు కట్టింగ్ లు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు .  రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలను బి.ఆర్.ఎస్ నాయకులు వక్రీకరిస్తున్నారని వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. బుధవారం   శామీర్ పేట,తూముకుంట లోని మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏ సబ్ స్టేషన్ కు వస్తారో రండి, నేను తీసుకుపోతా, పది గంటలకు మించి ఎక్కడా ఉచిత కరంట్  ఇవ్వటం లేదని నేను నిరూపిస్తా... 24 గంటలు ఇస్తున్నట్టు మీరు నిరూపిస్తారా..? అని వేణుగోపాల్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. ఉచిత కరెంట్ కు  కాంగ్రెస్  వ్యతిరేకమన్నట్టు బిఆర్ఎస్  నాయకులు ప్రకటనలు చేయటం పట్ల  వేణుగోపాల్ రెడ్డి మండి పడుతూ, అసలు ఉచిత కరెంట్ ఇచ్చిందే వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి అన్న విజయాన్ని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బిఆర్ఎస్ బోగస్ ప్రచారం చేసుకుంటూ, ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నదనీ, ఇది బిఆర్ఎస్ కాదు  బోగస్ రాష్ట్ర సమితి అని ఆయన గేలి చేశారు. కాళేశ్వరం నీరు తెచ్చి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్, కాళేశ్వరం నీరిస్తే ఉచిత కరెంట్ ఎందుకని కూడా ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్, రైతులకు రుణ మాఫీ, 108 సేవలు, పేదలకు ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొంటూ, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వేణుగోపాల్ వెల్లడించారు. కార్యక్రమంలో తుర్కపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు జీ.రాజయ్య, శామీర్ పేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊరడి వెంకటేష్, మండల జనరల్ సెక్రెటరీ తలారి భారత్ కుమార్, వార్డు మెంబర్ చంద్రా రెడ్డి, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు వల్లపు కుమార్ యాదవ్, ఆర్.మహేందర్, జి. శ్రావణ్, ఎన్.మహేష్,తదితరులు పాల్గొన్నారు.