తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్​ పరీక్షలు

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్​ పరీక్షలు

తెలంగాణలో  ఇంటర్‌ వార్షిక పరీక్షల  నిర్వహణకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి జరిగే పరీక్షల కోసం 1,473 కేంద్రాలను సిద్ధం చేసింది. ఫస్టియర్‌లో 4,82,677 మంది, సెకండియర్‌లో 4,65,022 మంది.. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్‌ 4న ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది నుంచి 100% సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడగనున్నారు. 614 ప్రభుత్వ కాలేజీలు, 859 ప్రైవేట్‌ కాలేజీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, 200 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఆన్సర్‌ బుక్స్‌ను ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ హైపవర్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను పెట్టారు. ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సహాయం కోసం 040-24601010, 040-24655027 నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు రావాలి.