నవీన్ ​హత్య కేసులో సంచలన విషయాలు

నవీన్ ​హత్య కేసులో సంచలన విషయాలు
Naveen murder case

హైదరాబాద్: తన ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడిని పాశవికంగా హతమార్చిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్రేమకు అడ్డొస్తున్నాడని నవీన్‌ను హత్య చేయాలని హరిహరకృష్ణ మూడు నెలల ముందే పథకం వేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం రెండు నెలల క్రితమే మలక్‌పేటలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ''ఈనెల 17వ తేదీన పక్కా ప్లాన్ ప్రకారం నవీన్‌ను హత్య చేశాడు. హత్యకు ముందు పెద్దఅంబర్‌పేటలో నవీన్, హరిహరకృష్ణ మద్యం తాగారు.

మద్యం మత్తులో యువతి విషయంలో స్నేహితులిద్దరి మధ్య ఘర్షణ  జరిగింది.  ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గొంతు నులిమి నవీన్‌ను హత్య చేశాడు. హత్య తర్వాత శరీరం నుంచి తల, వేళ్లు, ఇతర భాగాలను కత్తితో వేరు చేసి బ్యాగులో వేసుకొని పరారయ్యాడు. వాటిని తీసుకెళ్లి బ్రాహ్మణపల్లి పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత హరిహర కృష్ణ పక్కనే ఉన్న తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకొని హత్య చేసిన విషయాన్ని హసన్‌కు తెలిపాడు.  ఇదే విషయాన్ని మరుసటి రోజు ప్రియురాలికి కూడా చెప్పాడు. ఆ తర్వాత వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం వెళ్లాడు. 24వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు చేరుకొని శరీర విడిభాగాలను సేకరించి దహనం చేశాడు. 24న సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయాడు'' అని రిపోర్టులో పేర్కొన్నారు.