ముందస్తు ఉండదు షెడ్యూల్​ప్రకారమే ఎన్నికలు

ముందస్తు ఉండదు షెడ్యూల్​ప్రకారమే ఎన్నికలు
  • నిత్యం ప్రజలలోనే ఉండండి. 
  • నియోజకవర్గ పాదయాత్రలు చేయండి
  • అక్టోబర్​లో వరంగల్ లో భారీ బహిరంగ సభ
  • తాజా సర్వే ప్రకారం ఈసారి కూడా మనదే అధికారం
  • పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్​దిశా నిర్దేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ‘తెలంగాణలో ముందస్తు ఉండదు. షెడ్యూల్​ప్రకారమే ఎన్నికలుంటయ్. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలలో ఉంటూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించండి. నేటి నుంచి ఏప్రిల్​వరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుందాం. తాజా సర్వే ప్రకారం ఈసారి కూడా మనదే అధికారం. ఎన్నికల యేడాది కాబట్టి కేంద్రం మనపై కక్షగట్టి మరిన్ని ఈడీ, సీబీఐ దాడులు చేయించొచ్చు. భయపడకుండా దేనికైనా రెడీగా ఉండాలె’ అని సీఎం కేసీఆర్​బీఆర్ఎస్​శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత సమయం కంటే ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులలో  ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని స్పష్టం చేశారు. తెలంగాణభవన్​లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. నియోజకవర్గాలలో ఉన్న పెండింగ్ పనులు, సమస్యలను అక్టోబర్ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. గెలుపే లక్ష్యంగా అందరినీ కలుపుకుని పని చేయాలన్నారు. మరోమారు ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం తెలిపారు. 

గర్వం వద్దు
అధికారం మనదే అనే గర్వం వద్దని సీఎం శ్రేణులకు సూచించారు. డిసెంబర్​లో ఎన్నికలుంటాయని, అప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లామన్నారు. రైతులు, బడుగు, బలహీనవర్గాల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీలైతే నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్రలు చేయాల‌ని, నిత్యం కార్యక‌ర్తల స‌మావేశాలు నిర్వహించి ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని సూచించారు. పార్టీ నుంచి పదవులు రాలేదన్న కోపంతో ఉన్న పార్టీ శ్రేణులతో మాట్లాడాలని, అలాంటి వారితో నిత్యం టచ్​లో ఉండాలన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారిని సహించేదిలేదని పేర్కొన్నారు.

కేంద్రం తీరును ఎండగట్టండి..
ఎన్నికల సమయం కాబట్టి బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందన్నారు. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నందున ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ చేస్తోందని, ఇలాంటి దాడులు పార్టీ నేతలపై ఇంకా జరిగే ఛాన్స్​ ఉందన్నారు. భయపడకుండా అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రారంభించిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను దగ్గర ఉంచుకుని.. ఆ ఊరికి వెళ్లినప్పుడు వారిని ప్రత్యేకంగా కలిసి, యోగ, క్షేమాలు తెలుసుకోవాలని ఆదేశించారు.  నియోజకవర్గంలో ముఖ్య సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు అవసరమయ్యే నిధులపై జాబితా తయారు చేయాలని సూచించినట్లు సమాచారం. కుల సంఘాలు, యువజన సంఘాలతోపాటు మహిళా సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలను వివరించాలని పేర్కొన్నారు.

నేటి నుంచి ఆత్మీయ సమ్మేళనాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మార్చి 11 నుంచి ఏప్రిల్ వరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కేసీఆర్​ తెలిపారు. ఏప్రిల్ 25న గ్రామ స్థాయిలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని, ఏప్రిల్ 27న ప్రతినిధుల సభ, అక్టోబర్​లో వరంగల్​లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్​ ప్రకటించారు. అలాగే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.