ఇక కొత్త పార్టీ?! పొంగులేటి పునరాలోచన

ఇక కొత్త పార్టీ?! పొంగులేటి పునరాలోచన
  • జాతీయ పార్టీలలో చేరిక లేనట్టే!
  • ఉద్యమ నేతలతో కలిసి నయా ప్లాన్​
  • 30 నుంచి 45 స్థానాలలో పోటీ?
  • కనీస్ 25 సీట్లు గెలుస్తామని అంచనా
  • తామే కీలకంగా మారుతామనే ధీమా
  • టచ్ లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్​అసంతృప్తులు
  • ‘ఈటల’ వ్యాఖ్యలతో తాజా పరిణామాలు వెలుగులోకి
  • కాంగ్రెస్ వైపు చూస్తున్న జూపల్లి కృష్ణారావు?
  • అనుచరుల ఒత్తిడికి తలొగ్గుతున్న మాజీ మంత్రి  
  • ఢిల్లీ పెద్దలను కలిశాకే చేరాలని నిర్ణయం!!

బీఆర్ఎస్​ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా? తాజా పరిణామాల నేపథ్యంలో జవాబు ఔననే వస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటికి ఆహ్వానం అందగా, బీజేపీ నేతలు ఏకంగా పొంగులేటి ఇంటికెళ్లే చర్చలు జరిపారు. కానీ, పొంగులేటి, జూపల్లి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. తాము ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటన చేస్తామంటూ వాయిదా వేస్తున్నారు. తాజాగా వారు సొంతంగా పార్టీని ప్రకటిస్తారన్న చర్చ జోరందుకుంది. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారులను సమీకరించుకుని కొత్త అడుగులు వేయాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. 

రివర్స్​ కౌన్సెలింగ్
'ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ బలంగా లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగాను. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి' అని ఈటల రాజేందర్ తెలిపారు. 'ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, టీడీపీ సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంకాగాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించాను' అని ఈటల రాజేందర్ వెల్లడించారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
కొత్త పార్టీ ఏర్పాటే శరణ్యమని పొంగులేటి భావిస్తున్నారని సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జూపల్లి ఇప్పటికే ఆయన వెంట ఉన్నారు. ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన చకిలం అనిల్ కుమార్ కూడా పొంగులేటితో చర్చలు జరపారు. వీరితో పాటుగా ప్రొఫెసర్​ కోదండరాం కూడా ఇటీవల భేటీ అయ్యారు. ఇలా తెలంగాణ ఉద్యమకారులను సమీకరించుకునే పనిలో పడ్డారు. బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ను దీటుగా ఎదుర్కొనేందుకు పొంగులేటిని కొన్ని వర్గాలు ప్రత్యమ్నాయ నేతగా అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా పార్టీలలో అసంతృప్తితో ఉన్న నేతలు పొంగులేటి టచ్​లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్​, బీజేపీలోని పలువురు అసంతృప్తి నేతలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు పొంగులేటి వర్గం ప్రయత్నాలు చేస్తున్నది. ఇటు బీఆర్ఎస్​లో కూడా తొలి నుంచి గుర్తింపు దక్కకుండా ఉన్న నేతలు కూడా పొంగులేటితో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీలో తమ పార్టీని విలీనం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఇటీవల పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో చర్చలు పెట్టినట్లు తెలుస్తున్నది. 30 నుంచి 45 స్థానాలలో పోటీ చేయాలని వీరు భావిస్తున్నారు.

ఈటల వ్యాఖ్యల మర్మమేమిటి?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరికపై ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్​, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బీజేపీలో చేరడం కష్టమే అని ఈటల అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామంటున్న ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోనూ చేరతామనేది ఇప్పటి వరకూ స్పష్టం చేయడం లేదు. తాజాగా, ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరనే విషయం తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదించిన సమయంలో పొంగులేటి పలు డిమాండ్లను వారి ముందుంచినట్లు తెలుస్తోంది. అయితే, ఆ డిమాండ్లన్నింటికీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదని, కొన్నింటికి మాత్రమే ఓకే చెప్పిందని తెలిసింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు. కాంగ్రెస్​లో చేరినా వర్గ విభేదాలతో రాజకీయపరంగా తాము రాణించే పరిస్థితి ఉండదని పొంగులేటి వర్గం భావిస్తున్నది. 

కొత్త పార్టీపై చర్చ పెట్టారా ?                 
ఇటీవల గన్మెన్లు, సొంత సిబ్బందిని వదిలేసిన ఈటల రాజేందర్ శివారులోని ఫాంహౌస్​లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ పలు రాజకీయ చర్చలకు దారి తీసింది. పొంగులేటి కొత్త పార్టీ పెట్టబోతున్నా రని, ఆ క్రమంలోనే ఈటలతో రహస్య భేటీ జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చే విధంగా ఇప్పుడు ఈటల రాజేందర్​ వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. వారిద్దరూ బీజేపీకి రావడం లేదని స్పష్టమవుతున్నది. ఇటు కాంగ్రెస్​కూడా వారిపై ఆశలు పెట్టుకోవడం లేదు. ఫలితంగా కొత్త పార్టీని ప్రారంభిస్తారని, అసంతృప్తి నేతలకు ప్రత్యామ్నాయ వేదికగా మారుతుందని భావిస్తున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్​, బీజేపీలో అసంతృప్తులుగా ఉన్న నేతలు పొంగులేటితో టచ్‌లోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ కీలక నేతలు పొంగులేటితో సమావేశమైనట్లు సమాచారం. ఇటు నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ నాయకుడు చకిలం అనిల్‌ కుమార్‌ శనివారం ఖమ్మంలో భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. బీజేపీలోని ఒకరిద్దరు నేతలు కూడా ఇప్పటికే పొంగులేటి వెంట ఉండేందుకు సమ్మతి తెలిపినట్లు తెలుస్తున్నది. 

కీలకంగా మారడమే లక్ష్యం
ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాతో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి.. తాజాగా ప్రత్యామ్నాయ వేదికను ప్లాన్​ చేసినట్లుగా తెలుస్తున్నది. కొత్త పార్టీని ఏర్పాటు చేసి, 30 నుంచి 45 స్థానాల్లో పోటీకి దింపాలని, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికి తాము కీలకం అనే సంకేతాలు ఇవ్వాలని ప్లాన్​ చేస్తున్నారని పొంగులేటి వర్గీయులు చెప్తున్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాలను టార్గెట్​ చేసుకున్న ఆయన.. జిల్లాల వారీగా సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభను తలపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో కనీసం 20 నుంచి 25 సీట్లను గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను శాసించ వచ్చనేది పొంగులేటి వ్యూహంగా కనిపిస్తోంది. కాగా, బీఆర్ఎస్ లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న పొంగులేటి రెడ్డి సామాజికవర్గ నేతల పునరేకీకరణతో పాటుగా ఉద్యమ నేతలు, బీఆర్ఎస్​లో నిరాధరణకు గురవుతున్న నేతలను టార్గెట్​ పెట్టుకుంటున్నారు. ఈ రాజకీయ కార్యాచరణపై రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్‌ 2న కీలక ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పొంగులేటి కొత్త పార్టీ అంశం తెర మీదకు వచ్చింది. తాను ఏ పార్టీలో చేరాలా.. లేక సొంత పార్టీ పెట్టాలా అనే అంశంపై సుదీర్ఘంగా సర్వే చేయించినట్లు తెలుస్తున్నది. అయితే, గత వారం కిందట వరకు కాంగ్రెస్ లో చేరాలని 46శాతం, బీజేపీలోకి వెళ్లాలని 18శాతం ఉండగా, 28 నుంచి 30 శాతం కొత్త పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తేలిందని సమాచారం. దీంతో, ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు దిశగా పొంగులేటి అడుగులు వేస్తున్నారు. అయితే, తన నిర్ణయం ప్రకటించే వరకు ప్రజల్లో కొనసాగాలని, ఏదో ఒక ఆందోళన చేపడుతూ ఉండాలని నిర్ణయించుకున్న పొంగులేటి శనివారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పాలేరు నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేసేఆలోచనలో ఉన్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత మొదట ఖమ్మంలో, అనంతరం మహబూబ్‌నగర్‌, నల్లగొండలో బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు. 

కాంగ్రెస్​వైపు జూపల్లి?
ఇప్పటిదాకా పొంగులేటితో కలిసి నడిచిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. ఆయన క్యాడర్ అంతా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని సూచించడంతో ఈ మేరకు కాంగ్రెస్​లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో జూపల్లి ఆలస్యం చేస్తుండటంతో.. ఆయన వెంట నడిచిన లోకనాథ్​రెడ్డి తిరిగి బీఆర్ఎస్​వర్గంలోకి చేరిపోయారు. దీంతో మరింత ఆలస్యం చేస్తే తన వెంట ఉండే నేతలను కాపాడుకోలేని పరిస్థితి ఉంటుందని జూపల్లి భావిస్తున్నట్లు సమాచారం. ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా జూపల్లిని ఆహ్వానిస్తున్నది. జూపల్లి స్వంత నియోజకవర్గంలోని కేడర్ కాంగ్రెస్​లోకి వెళ్దామని చెప్పడంతో పాటు, కాంగ్రెస్ నుంచి కూడా అహ్వానం ఉండడంతో అటు దిశగా జూపల్లి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. తన సన్నిహితులతోనూ ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చిన తరువాత జూపల్లి తన అనుచరులతో కలిసి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని గాంధీభవన్​లోనూ టాక్​.