గ్రూప్​–1కు లైన్ క్లియర్

గ్రూప్​–1కు లైన్ క్లియర్
  • పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
  • 11న ప్రిలిమ్స్​నిర్వహణకు ఏర్పాట్లు 

ముద్ర, తెలంగాణ బ్యూరో : గ్రూప్–1 ప్రిలిమ్స్​పరీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సోమవారం వీటి మీద విచారణ జరిగింది. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షను పేపర్​ లీకేజీ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పరీక్షను టీఎస్​పీఎస్సీ నిర్వహించరాదని, ఒకేసారి పలు పరీక్షలు ఉండటం, వరుసగా నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్–1 ప్రిలిమ్స్​రద్దు చేయాలంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. టీఎస్​పీఎస్సీ కూడా కౌంటర్​ దాఖలు చేసింది. పరీక్ష నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఈ నెల 11న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. బెంచ్ దీనిని పరిగణనలోకి తీసుకుని 11న యథాతథంగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ​గ్రూప్–-1 ప్రిలిమినరీ పరీక్షపై సోమవారం ఉదయం వరకూ సందిగ్ధత నెలకొంది.

సిట్, ఈడీ దర్యాప్తు పూర్తయ్యేదాకా ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ పిటిషనర్లు కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషన్​ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీఎస్‌సీ లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని కోరారు. నిరుడు అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతో పాటు 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ జారీ చేసిన వెబ్ నోట్‌ను రద్దు చేయాలని కోరారు. వరుసగా నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారని, గ్రూప్​–2, 3, 4 పరీక్షలతో సంబంధం లేకుండా, కనీసం 2 నెలల గడువు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని మరో రెండు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ కాజా శరత్ విచారణ జరిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్ ఈ పరీక్షను వాయిదా వేయలేమంటూ అన్ని పిటిషన్లను కొట్టి పారేసింది. 

అక్రమాలకు పాల్పడితే కేసులే..
గ్రూప్–1 ప్రిలిమ్స్​ పరీక్షకు టీఎస్పీఎస్పీ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నది. పరీక్షకు15 నిమిషాల ముందే గేట్లను మూసివేసేందుకు నిర్ణయించింది. అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా.. కేసులు నమోదు చేసి, కమిషన్​ నిర్వహించే పరీక్షలు రాయకుండా డీబార్​ చేస్తామని అధికారులు ప్రకటించారు.