బీఆర్ఎస్ ఖాతాలో మరో కలికితురాయి

బీఆర్ఎస్ ఖాతాలో మరో కలికితురాయి
  • ‘భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‘​ 
  • భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, ఆస్తులు కలిగి ఉన్న బీఆర్ఎస్​ఖాతాలో మరో పెద్ద ఆస్తి జమైంది. దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటు చేస్తున్న ‘భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్ కేంద్రానికి’ పునాది రాయి పడింది. దీనికి సీఎం కేసీఆర్​ సోమవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ శివారు కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాజకీయ అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త సమాచారం లభించే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్‌ లైబ్రరీ, వివిధ భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోఢీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం, రాష్ర్టాలవారీగా, రంగాలవారీగా వివరాలను సమీకరించడం, వాటిని క్రోడీకరించడం వంటివి చేయనున్నారు. శిక్షణ, పరిశోధన కార్యక్రమాల కోసం, రిటైర్డ్‌ అధికారులు, న్యాయనిపుణులు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్నవారిని సమన్వయకర్తలు, శిక్షకులు, సబ్జెక్ట్‌ నిపుణులుగా నియమించనున్నారు. 

ప్రకృతి బాగుంటేనే భవిష్యత్​తరాలు పదిలం
సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో ఉంటాయని సీఎం కేసీఆర్​అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కోకాపేటలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) లే అవుట్ నియోపోలీస్ లో ఆయన మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ సంతోష్ కుమార్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ అందించిన మొక్కను కేసీఆర్​నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పంచభూతాల్లో భాగమైన నీరు, ప్రాణవాయువును కొనుక్కొనే దుస్థితికి మానవాళి చేరడానికి మానవ తప్పిదాలే కారణమని అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సత్యాన్ని మరువొద్దని ఉద్ఘాటించారు. 

రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చదనం పెరిగి జీవ వైవిధ్యం పరిఢవిల్లుతోందని సీఎం అన్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.70 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించడం గొప్ప విషయమన్నారు. ఇది తెలంగాణ ప్రజల పర్యావరణ పరిరక్షణ దీక్షకు దర్పణం పడుతున్నదన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. బృహత్ ప్రకృతి వనాలపై నీతి ఆయోగ్ ప్రశంసలు, హరితహారం ద్వారా 273 కోట్ల మొక్కలను నాటడం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా రికార్డులకెక్కిందని కేసీఆర్​వెల్లడించారు. ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ నివేదికలో పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కడం తదితర విజయాలన్నీ పర్యావరణ పరిక్షణపై రాష్ట్ర ప్రభుత్వానికున్న నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయని సీఎం అన్నారు. పర్యావరణహిత రాష్ట్రాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కె. కేశవరావు, సంతోశ్​కుమార్, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌, దామోదర్‌ రావు, సురేశ్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలె యాదయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.