హైదరాబాద్​ టు  బెంగళూర్​

హైదరాబాద్​ టు  బెంగళూర్​
  • గ్రీన్​సిటీకి టీ కాంగ్రెస్ వార్​రూం
  • ఇక అంతా అక్కడి నుంచే!
  • హైదరాబాద్​లో దాడుల భయంతోనే షిఫ్ట్
  • టీ కాంగ్రెస్​లో కీలక నిర్ణయం
  • డీకే ఆధ్వర్యంలో నిర్వహణ
  • సిద్ధరామయ్యకు ప్రధాన సలహాదారుడిగా సునీల్ కనుగోలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయాలన్నీ ఇక బెంగళూరు నుంచి ఖరారు కానున్నాయి. ప్రచార శైలి, అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సయోధ్య తదితర అంశాలన్నీ బెంగళూరు కేంద్రంగా నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వార్ రూం కూడా బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతమే రక్షణ కవచంగా కాంగ్రెస్ భావిస్తోంది. వార్ రూంలో జరిగే నిర్ణయాలన్నీ పార్టీ నేతలకు నేరుగా రానున్నాయి. సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ వార్​రూం వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వార్​రూంను బెంగళూరుకు మార్చారు. కాగా ఇకనుంచి సునీల్​రాష్ట్రానికి అధికారిక హోదాలో రానున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ప్రధాన సలహాదారుడిగా సునీల్​ కనుగోలు నియామకంతో ఆయనకు వీఐపీ హోదా దక్కింది.

వార్ రూం షిఫ్ట్

రాష్ట్రంలో కాంగ్రెస్ వార్​రూం ఇప్పటికే ప్రచారానికెక్కింది. పలుమార్లు పోలీసులు దాడులు చేశారు. కర్ణాటక ఎన్నికల ముందు మాదాపూర్​లోని వార్​ రూం నుంచి సమాచారాన్ని పోలీసులు తీసుకెళ్లారు. వార్ రూం నిర్వహిస్తున్న సునీల్​పై కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత వార్​రూంలో కాంగ్రెస్​నేతలపైనే వ్యతిరేక పోస్టింగ్ లు పెట్టిస్తున్నారంటూ హస్తం నేతలకు లీకులిచ్చారు. దీనిపై ఉత్తమ్​సహా పలువురు విమర్శలు కూడా చేశారు. కానీ ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరిగిందని సునీల్ రాష్ట్ర నేతలకు వివరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వార్​ రూంపై దాడి చేసి హార్డ్​ డిస్క్​లను తీసుకెళ్లారు. పదేపదే పోలీసులు కాంగ్రెస్ వార్​ రూంను టార్గెట్ చేయడం వెనుక ప్రభుత్వ ఆదేశాలే ఉన్నాయిన పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రానికి వార్​ రూంను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. సునీల్​కనుగోలు కూడా బెంగళూరుకు చెందినవారే కావడంతో అక్కడ భద్రత కూడా ఉంటుందని అంచనా వేశారు. కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ నేతృత్వంలోనే ఈ తెలంగాణ కాంగ్రెస్ వార్​రూం నిర్వహించనున్నారు. శివకుమార్​కు చెందిన భవనంలోనే వార్ రూం ఏర్పాటు చేశారు. దీంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ వేసే ప్రతి అడుగు బెంగళూరు నుంచే సూచించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్​లో పని చేస్తున్న సిబ్బందిని మొత్తం బెంగళూరుకు తరలించారు. 

దాడుల బెడదతోనే..?

ప్రస్తుతం రాష్ట కాంగ్రెస్​లో జోష్ పెరిగింది. వ్యూహాలు మారుతున్నాయి. కర్ణాటక మేనిఫెస్టోను అమలు చేస్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఇక్కడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతర్గతమైన అంశాలను బయటకు చెప్పొంద్దంటూ ఇప్పటికే పార్టీకి, వార్ రూం సభ్యులకు ఆదేశాలిచ్చారు. అయితే పోలీసుల భయం వారిని వెంటాడుతున్నది. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్​అధికారంలో ఉండటం, డీకే శివ కుమార్ సైతం రాష్ట్ర రాజకీయ వ్యూహాల్లో భాగస్వాములు అవుతుండటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ప్రత్యేక హోదాలో వచ్చే చాన్స్ ఉండటంతో వార్​ రూం మకాంను బెంగళూరుకు మార్చారు. అక్కడైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. 

కేబినెట్ హోదాలో సునీల్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చడంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. సీఎం ప్రధాన సలహాదారుగా కేబినెట్ హోదాతో పదవి కట్టబెట్టనుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సైతం సునీల్ వ్యూహాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడైనా పర్యటించే విధంగా కేబినెట్ హోదాను కట్టబెట్టారు. ప్రధానంగా తెలంగాణలో పర్యటించేందుకు ప్రొటోకాల్ అమలవుతుంది. గతంలో ఆయనపై కేసులు నమోదు చేయడంతో.. ఇక్కడి పోలీసులు ఎన్నికల సమయంలో టార్గెట్​చేస్తారని ముందుగానే అంచనా వేసిన కాంగ్రెస్​అధిష్టానం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

హస్తంలో చేరికల మైలేజ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ లో ఎవరుంటారో.. ఎవరు పోతారో తెలియని అయోమయ పరిస్థితులు కనిపించేవి. ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం, ద్వితీయ శ్రేణి లీడర్లు కూడా వారిబాటే పట్టడంతో  హస్తం పార్టీ ఉనికే  ఒక దశలో తెలంగాణలో ప్రశ్నార్థకంగా కనిపించింది. ఈ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్​ఘన విజయం సాధించడంతో నేతలకు వెయ్యి ఎనుగుల బలం వచ్చినట్లైంది. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం రాష్ట్రంలో విస్తృతంగా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో మమేకమవుతున్నారు. అగ్రనేతలు సైతం ఐక్యతారాగం వినిపిస్తుండడంతో పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో ఎన్నడూ లేనంతగా విజయంపై ధీమా వ్యక్తమవుతోంది. పైగా కాంగ్రెస్ లో ఇప్పుడు పెద్దఎత్తున చేరికలు కూడా మొదలయ్యాయి. 

సొంతగూటికి రంగం సిద్ధం..

వివిధ కారణాలతో కాంగ్రెస్ ను వీడిన ముఖ్య నేతలంతా తిరిగి  సొంతగూటికి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారిలో ప్రధానంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారని తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి తదితరులు హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. వీరిలో గురునాథ్ రెడ్డి ఈనెల 18న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, ద్వితీయ శ్రేణి లీడర్లు కూడా సైతం కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీలో ఉన్న పలువురు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వారిలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎంపీ కూడా ఉన్నారని తెలుస్తోంది.