అంబటి స్ఫూర్తి ఆదర్శనీయం

అంబటి స్ఫూర్తి ఆదర్శనీయం
  • మానవత్వం మూర్తీభవించిన మహానేత
  • సంస్మరణ సభలో వక్తల నివాళి
  • భారీగా హాజరైన రాజకీయ నేతలు, పాత్రికేయ పెద్దలు

విజయవాడ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పోరాడిన గొప్ప నాయకుడు అంబటి ఆంజనేయులు అని వక్తలు కొనియాడారు. జర్నలిజం విలువలను కాడటమే కాకుండా పత్రికా కార్మికుల హక్కుల సాధన కోసం ఆయన పోరాడారని, మానవత్వం మూర్తీభవించిన మహామనిషి అంబటి ఆంజనేయులు అని పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే అధ్వర్యంలో అంబటి ఆంజనేయులు సంస్మరణసభ విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు.

ఇండియన్‌ జర్నలిస్ట్సు యూనియన్‌ (ఐజేయూ)జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నతభావాలతో అనేకమంది మిత్రులను సంపాదించుకున్న నాయకుడు అంబటి అని గుర్తుచేశారు  విజయవాడలో పుల్లయ్య, నండూరు రామ్మోహన్‌రావు, సి.రాఘవాచారి వంటి మహామహులతో కలిసి పనిచేయటంతో పాటు తుదిశ్వాస వరకు జర్నలిస్టు ఉద్యమంలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రభలో సుదీర్ఘ సమ్మెకాలంలో, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పేపర్లు మూసివేసిన సందర్భాల్లో, కార్మికల వేతనాల కోసం జరిగిన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు.

 ఐజేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బల్వీందర్‌సింగ్‌ సంధూ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రజావ్యతిరేక విధానాలపై జర్నలిస్టులుగా పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నామన్నారు. ప్రెస్‌క్లబ్‌కు వచ్చి ఎవరైనా సమస్య చెపితే దాన్ని అర్థం చేసుకుని వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జర్నలిస్టులకు నాయకత్వం వహించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ సిన్హా మాట్లాడుతూ కేవలం జర్నలిస్టుల కోసం మాత్రమే కాకుండా న్యూస్‌ పేపర్లలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం అంబటి పని చేశారని చెప్పారు. ఆల్‌ ఇండియా న్యూస్‌ పేపర్స్‌ ఇండస్ట్రీకి జీవితాన్ని అంకితం చేశారన్నారు.

ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ ఉద్యమ నాయకుడుగా అంబటి... యాజమాన్యాలు, జర్నలిస్టులు, కార్మికులు మధ్య ఎలాంటి పొరపొచ్ఛాలు లేకుండా పోరాటం చేశారన్నారు. దాంతో యాజమాన్యాలు కూడా సానుకూలంగా స్పందించాయన్నారు. అంబటి మరణం మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌కు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

ఏఐసీసీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేపర్‌లో వచ్చే వార్తకు ప్రామాణికత ఉండేదన్నారు. నాటితరం నుంచి నేటి వరకు జర్నలిస్టు విలువల్ని కాపాడటంలో అంబటి కృషి చేశారని చెప్పారు. కొత్తగా జర్నలిజంలోకి వచ్చేవారు అంబటిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియా నియంత్రణకు పాత్రికేయ పెద్దలు సూచనలు చేయాలన్నారు. 

మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట రామయ్య(నాని) మాట్లాడుతూ ఎంత సంక్లిష్ట సమస్యనైనా మృదువుగా చెప్పటంలో అంబటి దిట్ట అన్నారు. తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకున్నారన్నారు. నాయకత్వం, పాత్రికేయం రెండూ వృత్తి వ్యసనాలన్నారు. ఈ రెండిరటినీ సమపాళ్లలో న్యాయం చేసిన గొప్ప నాయకుడు అంబటి ఆంజనేయులు అని కొనియాడారు. విజయవాడలో పేపర్‌ ఉన్నంత కాలం అంబటిపేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాల్లో మాస్‌ లీడర్‌కు ఉండే ఫాలోయింగ్‌ అంబటి ఆంజనేయులుకు ఉందన్నారు. జర్నలిస్టులు, కార్మికుల కోసం నిస్వార్థంగా పని చేశారన్నారు. అంబటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ 60 ఏళ్లుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం అంబటి చేసిన కృషిని వివరించారు. ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌ మాట్లాడుతూ అంబటి ఆంజనేయులు కుటుంబానికి యూనియన్‌ అండగా ఉంటుందన్నారు. ఐజేయూ కార్యదర్శి డి.సోమసుందర్‌, కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేశ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అంబటి సుబ్బారావు, సీపీఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్‌, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, సమాచార శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కస్తూరి, విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు, ప్రజాశక్తి సంపాదకులు తులసీదాస్‌, టీఎస్‌యూడబ్ల్యూజే నాయకులు రామనారాయణ,  ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, సీనియర్‌ పాత్రికేయులు సంపత్‌, భద్రం, మక్కెన సుబ్బారావు, ఎస్‌కే బాబు, వెంకట్రావ్‌, జర్నలిస్టు ఫోరం నాయకులు అంబటి బ్రహ్మయ్య, పీవీ రావు, మహబూబ్‌ ఆజం, లయన్స్‌ క్లబ్‌ మాజీ గవర్నర్‌ శ్రీనివాసరావు తదితరులు అంబటి ఆంజనేయులు సేవలను కొనియాడారు. 

ముందుగా సామ్నా అధ్యక్షుడు నల్లి ధర్నారావు అంబటి ఆంజనేయులు జీవిత విశేషాలను వివరిస్తూ తాను రాసిన పాటను గానం చేసి నివాలులర్పించారు. ఏపీయూడబ్యూలజే కృష్ణాజిల్లా యూనిట్‌ అధ్యక్షుడు చావా రవి అతిథులకు స్వాగతం పలికారు. ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి వసంత్‌ వందన సమర్పణ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీఆర్‌ మీడియా అకాడమీ కార్యదర్శి తిలక్‌, ఏపీయూడబ్ల్యూజే కృష్ణాజిల్లా కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, అంబటి ఆంజనేయులు కుమారులు అంబటి సంజయ్‌ కుమార్‌, సంతోశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు రాజశేఖర్‌ ఫోన్‌ ద్వారా నివాళులర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, అంబటి ఆంజనేయులు మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

అంబటి చిత్రపటం ఆవిష్కరణ

అంతకుముందు, పాత్రికేయుల పెన్నిధి అంబటి ఆంజనేయులు సంస్మరణ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆవిష్కరించారు. ప్రెస్‌క్లబ్‌లోని ప్రధాన సమావేశం మందిరానికి అంబటి ఆంజనేయులు హాల్‌గా నామకరణం చేశారు.