సిట్​ నోటీసులపై స్పందించని రేవంత్‌, బండి సంజయ్‌

సిట్​ నోటీసులపై స్పందించని రేవంత్‌, బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సిట్‌ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. ఈకేసుకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు నోటీసులు పంపించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలకు ప్లాన్‌ చేస్తోంది.పేపర్‌ లీక్‌ వ్యవహారంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు అడిగింది సిట్. దీనికి సంబంధించి ఇద్దరికీ నోటీసులు పంపించినా స్పందించలేదంటున్నారు సిట్‌ అధికారులు. అయితే తన ఆరోపణలకు సంబంధించి సిట్‌కి ఆధారాలు ఇచ్చానంటున్నారు రేవంత్‌. అదే సమయంలో తమకు ఎలాంటి ఆధారాలు చూపించలేదంటున్నారు సిట్‌ అధికారులు. ఇక బండి సంజయ్‌ తరఫున బీజేపీ లీగల్‌ సెల్‌ సిట్‌ ఆఫీస్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తాము ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలకు సిట్ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్‌, సంజయ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో న్యాయసలహా తీసుకుంటున్నారు సిట్‌ అధికారులు.  మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో.. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేశారంటూ మంత్రి కేటీఆర్‌ రేవంత్‌, బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంలో పదేపదే అనవసరంగా తన పేరు లాగుతున్నారని న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతుని కేటీఆర్‌ మండిపడ్డారు. ఐపీసీ సెక్షన్‌ 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. వారం రోజులలోగా ఇద్దరూ తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్​. లేదంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నారు. తనపై ఏయే సందర్భాల్లో ఎవరు ఏ ఆరోపణలు చేశారనే దానికి సంబంధించిన సాక్షాలను కూడా నోటీసుల్లో ప్రస్తావించారు.