పైసల్లేవ్!

పైసల్లేవ్!
  • రైతుబంధుకు నిధుల కొరత
  • జూన్​నెలాఖరు వరకూ కష్టమే
  • ఈసారి అవసరం రూ.7,600 కోట్లు
  • ముందుగా 5 ఎకరాల్లోపు రైతులకే జమ?
  • మిగిలినవారికి విడతలవారీగా పెట్టుబడి సాయం
  • ఆలస్యం అవుతుండడంతో రైతుల అసహనం
  • ప్రస్తుతం పంట నష్ట పరిహారం జమ చేస్తున్న సర్కారు
  • జిల్లాలవారీగా విడుదల చేస్తున్న ఆర్థిక శాఖ
  • ఇప్పటికి నాలుగు జిల్లాల్లో పంపిణీ

 
వానాకాలం పంటల సాగు మొదలైనా రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ కాలేదు. జూన్ మొదటి వారం నుంచే పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు వ్యవసాయ శాఖ సర్కారుకు నివేదిక అందించింది. అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో పెట్టుబడి సాయానికి ముహూర్తం కుదరడం లేదు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2 ఎకరాల్లోపు రైతులు 42 లక్షల మంది ఉండగా, 5 ఎకరాల్లోపు 11 లక్షల మంది ఉన్నారు. 10 ఎకరాల వరకు భూమి ఉన్నవారు 4.4 లక్షలున్నారు. ముందుగా 53 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యాసంగి ప్రారంభం కావడం, ఇంకా పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.

జిల్లాలవారీగా పరిహారం

ప్రస్తుతం ఎలాంటి నిధుల విడుదలకైనా ప్రభుత్వం కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే వరకు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఈ వారంలోనే మొదలుపెట్టింది. నాలుగు రోజుల నుంచి పరిహారం సొమ్ము విడుదల చేస్తున్నారు. దీంట్లో కూడా జిల్లాలవారీగా తీసుకుని, ఒక్కో జిల్లాకు ఒక్కోరోజు ఇస్తున్నారు. శుక్రవారం నాటికి నాలుగు జిల్లాలకు పరిహారం విడుదలైంది. మిగిలిన జిల్లాలకు కూడా విడతల్లో రోజువారీగా ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలను సైతం జిల్లాలవారీగా ఇస్తున్న ప్రభుత్వం రైతులకు పంట నష్టం పరిహారంలో కూడా ఇదే అమలు చేస్తున్నది. పరిహారం సొమ్ము పంపిణీ దాదాపు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నది. దీనికోసం రోజువారీ నిర్వహణ ఖర్చులకు బ్రేక్​వేసి, పరిహారం ఇస్తున్నారు. ఈ నెలాఖరువరకు పూర్తయితేనే రైతులకు రైతుబంధు సాయం అందనుంది.


ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. ఫలితంగా రైతులకు అందించే పెట్టుబడి సాయం అలస్యమవుతోంది. ప్రస్తుతం రైతుబంధును ఆలస్యం చేస్తున్న సర్కారు.. పంట నష్ట పరిహారం కోసం నిధులు సర్దుబాటు చేస్తోంది. ఒకేసారి విడుదల చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో జిల్లాలవారీగా విడుదల చేస్తున్నారు. శుక్రవారం నాటికి కేవలం నాలుగు జిల్లాలకే పంట నష్ట పరిహారం విడుదలైంది. పరిహారం పంపిణీ పూర్తి చేసిన తర్వాతే రైతుబంధు నిధులను సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. దీంతో జూన్​నెలాఖరు వరకు కూడా పెట్టుబడి సాయం రావడం కష్టమేనని తెలుస్తోంది.

ముందుగా 5 ఎకరాల్లోపే?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం అమలు చేస్తోంది. రెండోసారి అధికారంలోకి రావడానికి బీఆర్‌‌ఎస్‌కు కలిసివచ్చిన అంశం కూడా రైతుబంధు పథకమే. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం పంపిణీ చేయడంతో ఆ ఆనందంలో రైతులు బీఆర్ఎస్‌కు ఓట్లేశారు. అయితే 2018 ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పథకం అమలులో ఆలస్యం జరుగుతోంది. పంటల సీజన్ మొదలైనా రైతులకు సాయం చేయడంలో జాప్యం జరుగుతున్నది. ఇదే సమయంలో రైతులందరికీ ఒకేసారి విడుదల చేయలేక.. విడతలవారీగా పంపిణీ చేస్తోంది. తాజాగా ఈసారి కూడా రూ.7,650 కోట్లను రైతుబంధు కోసం విడుదల చేయాలని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. 

ఒకేసారి జమ చేయాలని విజ్ఞప్తులు..

జూన్​ నుంచి పెట్టుబడి సాయం చేసేందుకు సీఎం కేసీఆర్ గతంలో అనుమతి ఇవ్వడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆర్థిక శాఖ వద్ద నిధులు లేకపోవడంతో పెండింగ్ పడుతున్నది. ఈసారి విడతలవారీగా ఎకరం నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు తొలి ప్రాధాన్యతగా జమ చేయాలని భావిస్తున్నారు. 5 ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రం విడతలువారీగా పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. నిధులు సర్దుబాటు అయ్యేకొద్దీ వారికి విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి గత సీజన్​లో 10 ఎకరాలు పైబడిన రైతులకు నిలిపివేశారు. దాదాపు నెలన్నర తర్వాత 10 ఎకరాలకు పైబడి ఉన్నవారికి జిల్లాలవారీగా ఇచ్చారు. ఈసారి మాత్రం 5 ఎకరాల నుంచే వర్తింపజేయనున్నారు. అయితే, ఎన్నికల సమయం కావడంతో ఒకేసారి విడుదల చేయాలని విజ్ఞప్తులు వస్తున్నా ఆర్థిక కష్టాలతో విడుతల్లో ఇవ్వనున్నారు. 

నిరుడు ఇదే టైమ్​కు పంపిణీ ప్రారంభం..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు కూడా ఇప్పుడు ఖజానాలో నిధులు లేక అమలు చేయడంలో కకావికలం అవుతోంది. ఇదే సమయంలో బీసీల్లో కులవృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం పథకాన్ని కూడా ముందేసుకున్నారు. వీటికి దరఖాస్తులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దరఖాస్తుదారులందరికీ రూ.లక్ష చొప్పున ఇవ్వడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో రైతుబంధుకు సర్దుబాటు చేయడం గగనమవుతోంది. దీనికితోడు ఇతర శాఖల్లో బిల్లులన్నీ నిలిపివేశారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు పేరుకుపోయాయి. అటు గ్రామ పంచాయతీల్లో సైతం ఇదే పరిస్థితి. గతనెలలో వ్యవసాయ శాఖపై సమీక్షించిన సందర్భంలో జూన్ నెల మొదటి నుంచి రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్​ ప్రతిపాదించారు. 10 రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయాలని కూడా చెప్పారు. కానీ నిధులు లేకపోవడంతో ఇప్పుడు మొదలుకావడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే రైతులు విత్తనాలు వేసుకోడానికి భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. వానలు పడితే విత్తనాలు వేయడమే తరువాయి. అలాగే నార్లు కూడా పోయడం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో పెట్టుబడి సాయం అందిస్తే ఇబ్బందులు ఉండవని రైతులు ఆశపడుతున్నారు. నిరుడు వానకాలం సీజన్‌లో ఇదే సమయానికి రైతుబంధు పంపిణీ మొదలైంది.