బీభత్సం!

బీభత్సం!
  • ‘బిపోర్‌జాయ్’తో 1000 గ్రామాల్లో అంధకారం
  • నేలకొరిగిన 800 చెట్లు, విద్యుత్​స్తంభాలు
  • 500 ఇళ్లకు పాక్షిక నష్టం
  • క్రమేణా తగ్గుతున్న తుపాను ఎఫెక్ట్​
  • సహాయక చర్యల్లో రెస్క్యూ బృందాలు

గుజరాత్​: బిపోర్​జాయ్ తుపాను గుజరాత్​లో భారీ బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి తీరాన్ని తాకిన తుపాను 125 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 800 చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరోవైపు 500 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తుఫాను ప్రభావంతో గుజరాత్​తీర ప్రాంతవాసులు చిగురుటాకులా వణికిపోయారు. ప్రభుత్వం నాలుగు రోజుల ముందు నుండే అప్రమత్తత ప్రకటిస్తుండడంతో ఆస్తి నష్టం,  ప్రాణనష్టం పెద్దగా లేకపోవడం ఉపశమనం కలిగించే అంశం. శుక్రవారం సాయంత్రం కూడా తుపాను ప్రభావం కొనసాగింది. గాలుల తీవ్రత 70 కిలోమీటర్లుగా నమోదైంది. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్​, గుజరాత్ రెస్క్యూ బృందాలు, విద్యుత్, వాటర్​వర్క్స్ అధికారులు ఎమర్జెన్సీ సేవల్లో కొనసాగుతున్నారు. తుపాను తీవ్రత తగ్గిన వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. శనివారానికి తుఫాను ప్రభావం భారీగా తగ్గనుందని అధికారులు వెల్లడించారు. 10 రోజుల పాటు అరేబియా సముద్రంలో కొనసాగిన బిపోర్‌జాయ్ తుపాను.. గురువారం సాయంత్రం గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 125 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. తుఫాను తీరం దాటిన అనంతరం గాలుల తీవ్రత 70 కిలోమీటర్లుగా కొనసాగింది. అనంతరం కొన్ని గంటల తర్వాత బలహీన పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ బిపోర్‌జాయ్ తుపాను.. గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఈ తుపాను ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతోందని తెలిపారు. భారీ గాలులు, కుంభవృష్టి ధాటికి తాత్కాలిక నివాసాలు, భారీ వృక్షాలు కూలిపోవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రధాని ఆరా..

బిపోర్‌జాయ్ తుపాను విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తుపాను తీరం దాటిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు. గిర్ అడవుల్లోని క్రూర మృగాలు, సింహాల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి గుజరాత్ సీఎంను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు.

ముందస్తు చర్యలు..

తుపాను నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 94 వేల మంది ప్రజలను.. అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ తుపాను కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 99 రైళ్లు ఆలస్యంగా లేదా రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లడంపై శనివారం వరకు నిషేధం విధించారు. పోర్టులను మూసివేసి.. పడవలకు లంగరు వేశారు. గుజరాత్‌లోని రెండు ప్రముఖ ఆలయాలైన దేవభూమి ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయం.. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని సోమ్‌నాథ్ ఆలయాలను మూసివేశారు. 18 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 115 గుజరాత్ రోడ్లు, భవనాల శాఖకు చెందిన బృందాలు, 397 రాష్ట్ర విద్యుత్ శాఖ బృందాలు.. క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు అందిస్తున్నాయి. గుజరాత్ జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో కమర్షియల్ ఆపరేషన్స్‌ను నిలిపివేశారు.