హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం టీ యూడబ్ల్యూజే ఆందోళన

హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం టీ యూడబ్ల్యూజే ఆందోళన

హైదరాబాద్: జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ (జేహెచ్ ఎస్) కింద జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులపై వైద్యం అందేటట్టు చూడాలని, రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( టీయూడబ్ల్యూజే ) ఆందోళన చేపట్టనున్నది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు పదివేల పోస్ట్ కార్డులు రాయాలని గురువారంనాడు హైదరాబాదులో సమావేశమైన టియుడబ్ల్యూజే రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది.

టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐ జేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు కే సత్యనారాయణ, ఐ జేయూ మాజీ కార్యదర్శి దాసరి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కే రామ్ నారాయణ, దొంతు రమేష్, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, కార్యదర్శులు పైసల్ అహ్మద్, మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా శాఖల అధ్యక్ష కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో పార్లమెంట్ భవనం ఎదుట ఆగస్టులో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.