సీఎం కప్‌కు అద్భుతమైన స్పందన - ముగిసిన పోటీలు

సీఎం కప్‌కు అద్భుతమైన స్పందన - ముగిసిన పోటీలు
  • ఇకపై నిరంతరంగా సీఎం కప్‌ క్రీడా పాలసీలోనే సీఎం కప్‌ నిర్వహణ అంశాన్ని 
  • పొందుపరుస్తున్నాం - క్రీడల మంత్రి డా॥ వి. శ్రీనివాస్‌ గౌడ్‌
  • క్రీడాకారులను సన్మానించిన హోంమంత్రి మహమద్‌ అలీ, మండలి ఛైర్మన్‌ సఖేందర్‌ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, పలువురు శాసన సభ్యులు
  • రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇదో నూతన ఓరవడి
  • నిర్వహణలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌
ముద్ర ప్రతినిది, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్‌ - 2023 ముగింపు వేడుకలు నగరంలోని 6 స్టేడియాల్లో ఘనంగా నిర్వహించారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సంక్షేమ పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌, హోంమంత్రి మహమద్‌ అలీ, సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ హాజరైనారు. 
ఈ సందర్భంగా డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం కప్‌ నిర్వహించామని అద్భుతమైన స్పందన క్రీడాకారులలో లభించి, ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్‌ అయ్యిందని పేర్కొన్నారు. త్వరలో ప్రకటించబోయే నూతన క్రీడా విధానంలో సీఎం కప్‌ నిర్వహణ అంశాన్ని పొందు పరుస్తామని ఆయన తెలిపారు.
హోంమంత్రి మహమద్‌ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఏదైనా పట్టు పడితే వదిలి పెట్టడని, ఆయన నాయకత్వంలో ఈ పదేళ్లలో అన్ని రంగాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసారని అన్నారు. 
సాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ, సీఎం కప్‌ నిర్వహణ ఘట్టం క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇది ఒక నూతన ఓరవడి అని ఆయన అన్నారు. ఈ కప్‌ విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాట్స్‌ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. 
618 మండలాలు, 33 జిల్లాలు రాష్ట్ర స్థాయిలో, 6 స్టేడియాలు 18 క్రీడాంశాల్లో జరిగిన ఈ పోటీలో ఎంతో మంది నిబద్ధతో చిత్త శుద్ధితో కృషి చేసిన మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులకు, సిబ్బంది, కోచ్‌లు, వ్యాయామ, ఉపాధ్యాయులకు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. 
క్రీడల్లో పాల్గొనే వారికి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందని గుడి, బడి లాగే మైదాన్‌ కూడా పవిత్ర స్థలాలా జాబితాలో చేరిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సాట్స్‌ ఓఎస్‌డి డా॥ కె. లక్ష్మీ, డిప్యూటి డైరెక్టర్లు శ్రీమతి సుజాత, ధనలక్ష్మి, చంద్రారెడ్డి, అనురాధ,  ఓలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జగదీష్‌ యాదవ్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
సరూర్‌నగర్‌లో
సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన వాలీబాల్‌, కబడ్డీ, జిమ్నాస్టిక్స్‌ విభాగాల ముగింపు ఉత్సవాల్లో శాసన మండలి ఛైర్మన్‌ గుతా సుఖేందర్‌ రెడ్డి, సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. వాలీబాల్‌, కబడ్డీ ఫైనల్‌ పోటీలను వారు తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేసి, పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికేట్లు ప్రధానం చేసారు. 
ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్‌ శాసన సభ్యులు నోముల భగత్‌, రంగారెడ్డి డివైఎస్‌ఓ వెంకటేశ్వరరావ్‌, ఓలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జగదీష్‌ యాదవ్‌, ప్రేమ్‌రాజ్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జింఖాన గ్రౌండ్స్‌లో
జింఖాన గ్రౌండ్స్‌లో జరిగిన ఖో`ఖో పోటీల ముగింపు వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఖో`ఖో పోటీలను తిలకించిన మంత్రి మల్లారెడ్డి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులకు బహుమతులు పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికేట్లు ప్రధానం చేసారు. 
యూసఫ్‌గూడాలో
యూసఫ్‌గూడాలో జరిగిన ముగింపు వేడుకల్లో శాసన సభ్యులు మాగంటి గోపినాధ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై రెజ్లింగ్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసారు. 
గచ్చిబౌలిలో
గచ్చిబౌలిలో జరిగిన అథ్లెటిక్‌ అర్చరీ, బాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, స్విమ్మింగ్‌, హాకీ పోటీల విజేతలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. సాట్స్‌ ఆధ్వర్యంలో సీఎం కప్‌ నిర్వహణ అద్భుతంగా జరిగిందని లక్షలాది విద్యార్థిని విద్యార్థులు ఇందులో భాగస్వాములు కావడం సంతోషదాయకం అన్నారు.
షూటింగ్‌ రెంజ్‌లో
షూటింగ్‌ రెంజ్‌లో ముగిసిన పోటీల్లో విజేతలకు నగర మేయర్‌ శ్రీమతి గద్వాల్‌ విజయలక్ష్మీ అతిథిగా హాజరై బహుమతులు ప్రధానం చేసారు. పోటీలు ముగిసిన అనంతరం ఆయా జిల్లాలకు క్రీడాకారులు క్షేమంగా చేరుకొనేలా ‘సాట్స్‌’ పర్యవేక్షిస్తోంది.