రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలి

రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలి

అడగాల్సింది దళిత బంధు కాదు సీఎం కూర్చీ
బీ ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

ముద్ర, ముషీరాబాద్: రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఎస్సీ 57 ఉపకులాలు ఏకమై ముందుకు సాగాలని బి ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. మీరు అడగాల్సింది దళిత బంధు కాదు సీఎం కూసున్న కుర్ఛీ అని అన్నారు. ఉప కులాల వారు ముఖ్యమంత్రి ఎందుకు కావద్దని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ 57 ఉపకులాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో ఇందిరాపార్క్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఎస్సీ 57 ఉప కులాల ఐక్యత వేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం అధ్యక్షతన జరిగిన ఎస్సీ 57 కులాల లొల్లి లో బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ లక్షల మంది ఉన్న ఉప కులస్తులు ఏం లేక రోడ్లపై తిరుగుతుంటే లక్ష జనాభా లేనోడు ముఖ్యమంత్రి అయ్యుండని విమర్శించారు. దొంగలు రాజులై సెక్రటేరియట్ లో కూర్చుంటున్నారని మండిపడ్డారు. దళితులను కేవలం సంక్షేమ పథకాలకు పరిమితం చేస్తున్నారని అన్నారు. ఓట్లు వేసేది మనం వాళ్ళ జెండాలు మోసేది మనం కానీ ఇంకా అడుక్కుతినే పరిస్థితిలోనే ఉన్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు ధర్నాచౌక్ లో ఆందోళనలు చేస్తాం, మీ డిమాండ్లు చాలా చిన్నవి మనం పాలకులమైతే ఒక్క సంతకంతో వస్తాయి. మనం పాలకులం కావాలనే బి.ఎస్.పి లో చేరానన్నారు. ఓటును అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి కొందరికి విముక్తి ఇచ్చి పేద ప్రజల, అమరవీరుల తెలంగాణ తెచ్చుకోవాలన్నారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఉప కులాలకు దళిత బంధు ఇవ్వాలన్నారు. ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. దళితులకు ఇచ్చిన మాట ప్రకారం మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పిడమర్తి రవి మాట్లాడుతూ దళిత బంధు పథకంలో జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదన్నారు. మాల మాదిగలకే దళిత బంధు ఇస్తున్నారు. ఈ ఒక్క విడత మాత్రమే దళిత బంధు అని తర్వాత వచ్చే ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. మాల మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ పెడితే తప్పేంటని ప్రశ్నించారు. ఉప కులాలను కూడా గుర్తించాలని, వారికి పథకాలు అమలు చేయాలని అన్నారు. తర్వాత తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ దళిత బంధు మాదిగ, మాల కులాలకే సరిగా ఇవ్వడం లేదని 57 ఉపకులాలకు ఇస్తాడా అని ప్రశ్నించారు. అధికారం మన చేతిలో ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.  ఓటు అమ్ముకోవద్దని, సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన దుస్థితి తెచ్చుకోవద్దన్నారు. మన ఓటు మనం వేసుకుని అధికారానికి దగ్గరగా వెళ్లాలని అడుక్కోవడం బంద్ చేయాలన్నారు. మీరు అధికారంలోకి వస్తే కవిత పిల్లలకు కల్యాణ లక్ష్మి ఇస్తారన్నారు. తెలంగాణ ఎస్సీ 57 ఉప కులాల ఐక్యత వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ జహంగీర్, ప్రధాన కార్యదర్శి మంగేష్, నాయకులు రాజమౌళి, మల్లేశం, వీరేష్, దీపక్, రవి, శంకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.