23న 'సేవ్ జర్నలిజం డే'

23న 'సేవ్ జర్నలిజం డే'

విజయవంతం చేయాలని టీయూ డబ్ల్యూ జే విజ్ఞప్తి

హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను  కాపాడాలని , పత్రికా రంగ అస్తిత్వాన్ని పరిరక్షించాలని  పాత్రికేయుల వృత్తి , వేతన భద్రత, హక్కులను పరిరక్షించాలని , పాత్రికేయుల పై దాడులను అరికట్టాలని కోరుతూ మార్చ్ 23న దేశవ్యాప్తంగా "సేవ్ జర్నలిజం డే" కార్యక్రమాన్ని చేపట్టాలని ఐజెయు  ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టి యు డబ్ల్యూ జే) రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి చేసింది. స్వయంగా పాత్రికేయుడుగా పనిచేసి ఎన్నోరచనలు  చేసిన  అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ , ఆయన సహచరులు అమరులు రాజగురు  , సుఖదేవ్ దేశమాత స్వేచ్ఛకోసం దైర్యంగా ఉరికంబాన్ని ముద్దాడి ఆత్మబలిదానం చేసిన మార్చ్ 23 న వారి పోరాటస్పూర్తితో  "సేవ్ జర్నలిజం డే" పాటించాలని మార్చి 18-19 తేదీల్లో చండీగఢ్ లో సమావేశమైన ఐ.జే.యు. జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, సంపాదకులను, జర్నలిస్టులను స్వేచ్ఛగా పనిచేయనివ్వాలని, తమకు నచ్చని కథనాలు రాసిన జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం మానుకోవాలని డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ కవాడిగూడ లోని పి. ఐ. బి. కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఆందోళన కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టియుడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్ విరాహత్ అలీ ఒక ప్రకటనలో కోరారు.