అ‘టెన్షన్’ ఢిల్లీ–హైదరాబాద్ గరం గరం

అ‘టెన్షన్’ ఢిల్లీ–హైదరాబాద్ గరం గరం
  • హస్తినలో దీక్షకు కవిత సిద్ధం
  • మద్దతుగా వెళ్లిన మంత్రులు సబిత, సత్యవతి
  • అక్కడే పోటీ దీక్షలకు రెడీ అయిన బీజేపీ
  • ఇక్కడ సంజయ్, డీకే అరుణ నిరసన 
  • దేశ రాజధానిలో మోహరించిన ఇరు పార్టీల బలగాలు
  • తెలంగాణలోనూ రాజుకున్న రాజకీయ వేడి
  • హాట్ హాట్ కామెంట్స్ చేసిన మంత్రి కేటీఆర్ 
  • అదే స్థాయిలో రిటార్ట్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • ఆచీతూచీ స్పందించిన కాంగ్రెస్ నేత భట్టి

ఢిల్లీ లిక్కర్​ స్కామ్ పరిణామాలు హీటెక్కుతున్నాయి. కవితకు ఈడీ నోటీసులు రావడం, శనివారం విచారణకు హాజరవుతానని కవిత చెప్పడం, ఈడీ కూడా ఆమోదించిన నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా కేసీఆర్ కుమార్తె చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు ప‌రిభ్రమిస్తున్నాయి. రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. క‌విత‌ను అరెస్ట్ చేయ‌డానికే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు ప‌క‌డ్బందీ వ్యూహం రచించాయని బీఆర్ఎస్ వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. అవినీతికి పాల్పడితే చేస్తే మూల్యం చెల్లించక తప్పదని, కేంద్రానికి, దర్యాప్తు సంస్థలకు సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కవిత ఢిల్లీలో మహిళా దీక్షకు పూనుకున్నారు. ఇటు బీజేపీ కూడా అటు ఢిల్లీలోనూ, ఇటు హైదరాబాద్ లోనూ పోటీ దీక్షలకు  పిలుపునిచ్చింది. ఇక కాంగ్రెస్ ఈ వ్యవహారంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నది. 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
లిక్కర్​ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేక‌నే క‌విత‌పై క‌క్షపూరిత కేసులు న‌మోదు చేస్తున్నార‌ని మండిపడుతున్నాయి. ‘ఈడీ నోటీసులు కాదు.. మోడీ నోటీసులంటూ’ కేటీఆర్ ఆరోపణలు సంధించారు. కవితను అరెస్ట్​ చేస్తే ఎలా సింపతీ సాధించాలనే సమాలోచనలు కూడా చేస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత   ప్రమేయం ఉందని ఈడీ చెప్పడంతో  దేశం ముందు తెలగాణ సిగ్గుతో తలవంచుతోందని బీజేపీ ఎదురుదాడికి దిగుతున్నది. కవిత లిక్కర్ స్కాంలో కీలక కుట్రదారుగా ఉన్నారన్నారని వాదిస్తున్నది. కవితతోపాటు మిగతా అందరికీ నోటీసులు ఇచ్చారని, ఆమెకు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వ లేదని చెబుతున్నది. రెండు పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. బీఆర్ఎస్​ తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుంటోంది. దీనిపై బీజేపీ కౌంటర్ ఇస్తోంది. నిజానికి ఈడీ నోటీసులు జారీ చేసిందే కానీ, ఇప్పటి వరకూ ఆమె పేరును ఇంకా నిందితురాలిగా చేర్చలేదు.  

దీక్షలు.. పోటీ దీక్షలు
మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్షకు కవిత సిద్ధమయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తెలియాజేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా ‘మహిళా గోస–బీజేపీ భరోసా’ పేరుతో ఈ దీక్ష నిర్వహించనున్నారు. ఈ దీక్షలో బండి సంజయ్ తోపాటు డీకే అరుణ, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో బీజేపీ నిరసనలు చేపట్టనుంది. దీన్ దయాల్ మార్గ్ లోని ఆంధ్ర స్కూల్ వద్ద బీజేపీ నేతలు ధర్నాకు దిగనున్నారు. ముందుగా జంతర్​ మంతర్​ దగ్గరే బీజేపీ దీక్ష చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నా, పోలీసుల అనుమతి నేపథ్యంలో వేదికను మార్చారు. 

బీఆర్ఎస్​ బల నిరూపణ
కవిత దీక్షకు ఎన్ని విపక్ష పార్టీలు హాజరవుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. దీక్షకు వచ్చే పార్టీలు, కవితకు సంఘీభావం, మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వామపక్షాల తరుపున సీతారాం ఏచూరి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీజేపీ దాడులను అడ్డుకునే కోణంలో బీఆర్ఎస్ కు ఆయన మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు. కవిత దీక్ష విషయంలో బీజేపీని వ్యతిరేకించే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయా ?  అన్నది కూడా అనుమానమే అని చెప్పాలి. దేశంలోని ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ ఈ దీక్షకు దూరంగా ఉండనుంది. బీఆర్ఎస్ సైతం ఆ పార్టీని ఆహ్వానించే అవకాశం లేదు. గతంలో కేసీఆర్ కలిసిన రాజకీయ పార్టీలు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నేతలు ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లిక్కర్​ కేసులో మనీశ్​ సిసోడియాను అరెస్ట్​ చేయడాన్ని ఖండిస్తూ తొమ్మది మంది విపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారు. వారంతా ప్రస్తుతం సైలెంట్​ గా ఉన్నారు. కనీసం దీక్షకు తమ పార్టీ ప్రతినిధులను పంపాలని బీఆర్ఎస్​కోరుతున్నట్లు సమాచారం. 

ఢిల్లీకి మంత్రులు
 గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్​ భేటీలో కవిత అంశంపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో కవిత చేపట్టిన దీక్షకు మద్దతుగా పలువురు మంత్రులు హస్తినకు వెళ్లాలని సీఎం కేసీఆర్​ సూచించినట్లు తెలుస్తున్నది. దీనిలో భాగంగా మమిళా మంత్రులు వెంటనే కేబినెట్​ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. సత్యవతి రాథోడ్​, సబితా ఇంద్రారెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా శుక్రవారం ఉదయం వెళ్లనున్నట్లు సమాచారం. 

నేడు బీఆర్​ఎస్​ కీలక భేటీ
చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్​ పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్​లు, పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్షలు, కార్యవర్గంతో తెలంగాణ భవన్​లో సమావేశం నిర్వహిస్తున్నారు. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. లిక్కర్​ స్కాంలో వచ్చే పరిణామాలపై పార్టీ నేతలను బీజేపీపై యుద్దానికి సన్నద్ధం చేసేందుకు సీఎం కేసీఆర్​ రూపకల్పన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.