సెంట్రల్ ​మినిస్టర్ ఎవరు!?

సెంట్రల్ ​మినిస్టర్ ఎవరు!?
  • తెరపైకి వివేక్ వెంకటస్వామి పేరు
  • ఎస్సీల మద్దతు కోసం బీజేపీ ప్లాన్​
  • బండి సంజయ్ చాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ
  • ప్రయత్నాలు తీవ్రతరం చేసిన అర్వింద్​
  • రాజ్యసభ కోసం గరికపాటి యత్నాలు
  • ఆశలు వదిలేసిన సోయం బాపూరావు
  • ప్రధాని విదేశీ పర్యటనలోగా కేబినెట్ విస్తరణ​
  • గవర్నర్​ కూడా బదిలీ అయ్యే చాన్స్​


రాజ్యసభకు ఎంపిక చేసి!

రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి కొన్ని కీలక వ్యవహారాలలో మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఆయన ప్రధాన బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. కొంతకాలంగా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం ఆయన పార్టీ నుంచి చేజారకుండా చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగానే ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయించి, కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతున్నది. బీజేపీలోకి ముఖ్య నేతలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని దళితవర్గాలను తమవైపు తిప్పుకునే ప్లాన్​ కూడా సక్సెస్​ అవుతుందని బీజేపీ జాతీయ నేతలు అంచనా వేస్తున్నారు. 


ముద్ర, తెలంగాణ బ్యూరో :కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణకు సమయం ఆసన్నమైంది. బీజేపీ రాష్ట్ర పగ్గాలు కిషన్ రెడ్డికి చేతికి అప్పగించడంతో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగుతారని తేలిపోయింది. నాలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్ష పదవులను కేంద్రమంత్రులకు ఇవ్వడంతో వారి స్థానాలలో కొత్త వారిని భర్తీ చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం నుంచి ఎవరికి చాన్స్​ వస్తుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. బండి సంజయ్​కు సహాయ మంత్రి పదవి ఇస్తారని భావించినప్పటికీ, ఆయనకు ఇప్పుడు 50 శాతం వరకే చాన్స్​ఉందని అంటున్నారు. అధిష్టానం నేతలతో దూరం పెరుగడం, తాజాగా వరంగల్​ పర్యటనలో కూడా ప్రధాని మోడీ పెద్దగా ప్రయార్టీ ఇవ్వకపోవడంతో సంజయ్​కు మంత్రి పదవిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆర్ఎస్ఎస్​లో రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత కూడా సంజయ్​కు వ్యతిరేకంగా ఉండటం కొంత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన మరో నేత వివేక్ పేరు వినిపిస్తున్నది. గవర్నర్​తమిళి సై సౌందరరాజన్ ను​ కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. పెండింగు బిల్లులను క్లియర్​ చేస్తామంటూ ప్రకటించడంతో గవర్నర్​ బదిలీ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

అంతటా ఉత్కంఠ

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి చాన్స్​వస్తుందనే ఉత్కంఠ నెలకొన్నది. రెండు రోజులలో కేబినెట్​లో మార్పులు ఉంటాయని అంటున్నారు. మంగళవారం లేదా బుధవారం కొత్త కేబినెట్​ను ప్రకటిస్తారంటున్నారు. 22 మంది పాత మంత్రులకు ఉద్వాసన పలికి ఈ స్థానంలో కొత్తవారిని భర్తీ చేయనున్నారు.13న ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఉండటంతో అంతకు ముందే కేంద్ర కేబినెట్​విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ప్రధాని పర్యటన అనంతరం విస్తరణ చేస్తే పరిణామాలు మరింత మారుతాయని అంటున్నారు. రాష్ట్రం నుంచి ఒకరికి కచ్చితంగా సహాయమంత్రి వచ్చే చాన్స్​ఉంది. వివేక్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, వివేక్, లక్ష్మణ్ పేర్లు ప్రధానంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేరు ప్రస్తావనకు వచ్చినా, ఇప్పుడు ఆయనకు అవకాశం లేదని కేంద్ర పెద్దలే స్పష్టం చేశారంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ బీసీ జపం చేస్తున్నది. ఈ క్రమంలో డాక్టర్ లక్ష్మణ్​కు కూడా చాన్స్​ ఉంటుందని కూడా టాక్​. 

ఢిల్లీలో వాడుకుంటామంటే?!

నిజానికి బీజేపీలో నాయకత్వ మార్పులను ఎవరూ ఊహించలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ అంతటి సాహసం చేస్తుందా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉన్నట్టుండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన అధిష్టానం ఆయన అవసరాలను ఢిల్లీలో వాడుకుంటామని చెప్పుకొచ్చింది. దానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఆనవాయితీ ప్రకారం ఆయన్ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. మాజీ  ప్రధానులు, రాష్ట్రాలలో పార్టీ పగ్గాలు నిర్వహించిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తీసుకోవడం బీజేపీ ఆనవాయితీ. ఇటీవల మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం అక్కడ కేంద్రమంత్రులతో భేటీ కావడంపై తీవ్ర చర్చ జరిగింది. సాధారణంగా కేటీఆర్ ఢిల్లీకి వెళితే పలు కార్యక్రమాలలో పాల్గొని వచ్చేవారు. ఈసారి ఏకంగా నలుగురైదుగురు కేంద్రమంత్రులతో సమావేశం కావడంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అమిత్ షాతో భేటీ చివరి నిమిషంలో రద్దు కావడంతో అసలేం జరిగిందనేది అర్థం కావడం లేదు. కేటీఆర్ పర్యటన తరువాత బీజేపీ అధ్యక్షుని మార్పు అంటూ విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తరువాత పదవికి బండి రాజీనామా చేయడం, కొత్త అధ్యక్షుడి నియామకం జరిగిపోయాయి. 

గవర్నర్​ను మారుస్తారా?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం స్పెషల్ టీమ్ ను తయారు చేసుకుంటున్న ప్రధాని మోడీ, కొందరు కేబినెట్​మంత్రులతో పాటుగా కొన్ని రాష్ట్రాల సీఎంలను సైతం మారుస్తారని, కొందరు గవర్నర్లకు కూడా స్థాన చలనం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై  కూడా బదిలీ జాబితాలో ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక బిల్లులపై సోమవారం ఒక్కసారిగా రాజ్ భవన్​ ప్రకటన ఇచ్చింది. బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తున్నట్టుగా​ప్రకటించింది. యూనివర్సిటీల బిల్లు కూడా క్లియర్ చేస్తామంది.​దీంతో గవర్నర్ బదిలీ అవుతారని, దీని కోసమే బిల్లులను క్లియర్ చేస్తున్నారనే​ప్రచారం చక్కర్లు కొడుతున్నది.