'నాటు నాటు' పాటకు  డ్యాన్స్‌ చేసిన సునీల్​  గావస్కర్‌ 

'నాటు నాటు' పాటకు  డ్యాన్స్‌ చేసిన సునీల్​  గావస్కర్‌ 

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌  'నాటు నాటు' సెలబ్రేషన్సే.  ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు దక్కించుకుని ప్రపంచవేదికపై సత్తా చాటిన ఈ పాటకు ప్రతి ఒక్కరూ కాలు కదుపుతున్నారు. ఈ ఫీవర్‌ ఇప్పుడు క్రికెట్‌కూ పాకింది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఈ పాటకు ఫిదా కాగా.. తాజాగా మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌  ఇందులో భాగమయ్యారు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు స్టేడియంలో ఈ పాటపై స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు క్రీడా ఛానల్‌తో గావస్కర్‌ మాట్లాడారు.  ఈ పాటకు ఆస్కార్‌ దక్కడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ ఘనత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషిని కొనియాడారు. ఈ సినిమా తాను చూశానని.. ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ పాట సెలబ్రేషన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా ఉంటాయని చెప్పారు. ఇక ఈ పాటకు స్టెప్పులేసి తనలో ఉన్న ఉత్సాహాన్ని సన్నీ చాటారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ ఛానల్‌ ట్విటర్‌లో పంచుకుంది.