టార్గెట్ బీఆర్ఎస్

టార్గెట్ బీఆర్ఎస్
  • కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం
  • ప్రభుత్వ​వైఫల్యాలు, అవినీతిపై ఫోకస్
  • రాష్ట్రంలోనూ కర్ణాటక ఫార్ములా అమలు
  • వివాదస్పద అంశాలు ప్రస్తావించొద్దు
  • అసంతృప్తిని పక్కనబెట్టి గెలుపు కోసం పని చేయాలి
  • అమలుకు సాధ్యమయ్యే అంశాలే జనంలోకి 
  • టి– కాంగ్రెస్​నేతలకు అధిష్టానం దిశానిర్దేశం
  • బీసీలకు గెలిచే సీట్లివ్వాలని వీహెచ్ వినతి
  • ఎవరితోనూ పొత్తు ఉండబోదన్న మధుయాష్కీ
  • ఈసారి అభ్యర్థుల ప్రకటన ముందే ఉంటుందన్న ఉత్తమ్  

ఉత్కంఠ రేపిన తెలంగాణ కాంగ్రెస్​స్ట్రాటజీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్​గాంధీ కాంగ్రెస్​కీలక నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, వారి ఐక్యతాయత్నాలు, ఎన్నికల వ్యూహాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. సుమారు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి బీఆర్‌ఎస్‌ అవినీతి ప్రధాన లక్ష్యంగా పోరాట వ్యూహాన్ని ఖరారు చేశారు. 

సాధ్యమయ్యే అంశాలే జనంలోకి

అమలుకు సాధ్యమయ్యే అంశాలనే మేనిఫెస్టోలో పొందుపర్చాలని రాహుల్​టి–కాంగ్రెస్​నేతలకు సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాద్యత కాంగ్రెస్ పార్టీపై ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. టిక్కెట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు పట్టుబట్టారు. గెలిచే స్ధానాల నుంచే టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. జిల్లా కమిటీల నియామకం పూర్తి చేయాలని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి సూచించారు. జానారెడ్డి, జీవన్​రెడ్డి, షబ్బీర్​అలీ. దామోదర రాజనర్సింహా, శ్రీధర్​బాబు, సీతక్క తదితరులు కూడా పలు సూచనలు చేశారు. 


ముద్ర, తెలంగాణ బ్యూరో:పార్టీ మేనిఫెస్టోను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని రాహుల్ టి– కాంగ్రెస్ నేతలకు​సూచించారు. పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టోలో అంశాలు పొందుపర్చాలని, సాధ్యమయ్యే అంశాలనే ప్రచారంలో ప్రస్తావించాలని అన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసుకోవడం ద్వారా పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయాలన్నారు. పార్టీలో చేరికల పరంపర మొదలైన క్రమంలో ఆయా నియోజకవర్గాలలో నేతల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలన్నారు. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్​అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ కమిషన్ల వ్యవహారం కాంగ్రెస్ గెలుపునకు కలిసొచ్చిన అంశంగా మారిన నేపథ్యంలో తెలంగాణలోనూ బీఆర్ఎస్​అవినీతిని ప్రజలలోకి తీసుకెళ్లాలని అధిష్టానం సూచించింది. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్​ఇచ్చిన అపరిష్క్రత హామీలతో పాటు కాంగ్రెస్​అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతుందో ప్రజలకు వివరించాలని అధినేతలు సూచించారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు 70 శాతం సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్​తెలంగాణలోనూ అదే వ్యూహం అనుసరించాలని భావిస్తోంది. దీంతో ఎన్నికల వరకు అభ్యర్ధుల ప్రచారానికి ఆస్కారం ఉంటుందనే భావనతో ఉంది. రెబెల్స్ బెడద ఉన్న నియోజకవర్గాలలో అసంతృప్తులను బుజ్జగించే బాద్యత ఏఐసీసీ తీసుకుంది. టిక్కెట్ల విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్న అధిష్టానం అభ్యర్థులపై సమగ్ర సర్వే, జనంలో ఉన్న ఆదరణ, సామాజిక నేపథ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాలకే బీ ఫామ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సీనియర్​ నేత ఒకరు చెప్పారు.  

బీజేపీ లాభం చేకూర్చేలా బీఆర్ఎస్

బీఆర్‌ఎస్ అన్ని రాష్ట్రాలలో బీజేపీతో జత కడుతుందని తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్​రావ్​ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ గట్టిగా ఉన్న చోట బీజేపీకి లాభం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమీ చర్చకు ప్రధాన పార్టీలు హాజరయ్యాయని, కానీ కేసీఆర్​వెళ్లకపోవడం బీజేపీతో ఒప్పందానికి నిదర్శనమన్నారు. అదే రోజు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కావడం వెనక మతలబేంటనీ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని రాహుల్​గాంధీకి మాటిచ్చారని ఇకపై నేతల మద్య ఎలాంటి అంతర్గత విభేదాలు ఉండబోవని స్పష్టం చేశారు. 

విభేదాలపై వార్నింగ్

ఎవరి వారే తమ తమ ప్రత్యేక ఎజెండాతో ఢిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్​ నేతలకు అధిష్టానం ఝలక్​ఇచ్చింది. కీలక నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై రాహుల్​సీరియస్​అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అసంతృప్తిని బహిరంగ వేదికల ద్వారా వ్యక్తపరిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్​ఇచ్చినట్లు సమాచారం. ఒకే విషయంలో నేతల మద్య విభేదాలు ఉండడం సాధారణమన్న రాహుల్​వాటిని కలిసి పరిష్కరించుకోవాలన్నారు. అలా కుదరకపోతే మాణిక్​రావ్​ఠాక్రే దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ కోసం అన్ని స్థాయిలలోని నేతలు కలిసికట్టుగా, ఐక్యంగా పనిచేయాల్సిందేనన్న రాహుల్​కర్ణాటక ఫలితాలను తెలంగాణలో చూడాలనుకుంటున్నానని చెప్పినట్లు తెలిసింది. పార్టీలో ఏ నాయకులు ఏం చేస్తున్నారో తనకు అంతా తెలుసని అన్నారు. ఇప్పటి వరకూ ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో తన దగ్గర నిర్దిష్ట సమాచారం ఉందని ఝులక్​ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత హైకమాండ్‌దేనని తేల్చి చెప్పినట్లు తెలిసింది. సమావేశం తర్వాత జగ్గారెడ్డి భుజం మీద చేయి వేసి టెన్​జన్​పథ్ లోని తన ఇంటికి తీసుకెళ్లారు. సుమారు 20 నిమిషాల తర్వాత కేసి వేణుగోపాల్ తో కలిసి జగ్గారెడ్డి​బయటికి వచ్చారు. ఏం చర్చించారో బయటికి రాలేదు. అయితే జగ్గారెడ్డిని ఢిల్లీలో ఉండాలని సూచించిన రాహుల్​నేడు ఆయనకు మరోసారి అపాయింట్ మెంట్​ఇచ్చినట్టు తెలిసింది. 

ధరణిపై కమిటీ 

ధరణి అమలులో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై టి– కాంగ్రెస్​నేతలు చేస్తోన్న పోరును మరింత ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్​అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్​రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధరణి అవినీతిని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ కూడా వాటిని ఫోకస్​చేస్తున్న క్రమంలో ఈ అంశాన్నీ కాంగ్రెస్ ప్రధాన ఎజెండాగా తీసుకుంది. ధరణి పోర్టల్​పై పోరాటానికి ప్రణాళిక రూపొందించాలని రాహుల్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్ఎస్, బీజేపీ డీల్ పై ప్రచారం 

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేయకపోవడం వెనుక డీల్‌ ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీ, -బీఆర్‌ఎస్‌ల అవగాహనలో భాగంగానే కవిత అరెస్ట్‌ ఆగిపోయిందని ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని స్ట్రాటజీ సమావేశంలో టీ కాంగ్రెస్​నేతలను ఆదేశించినట్లు తెలిసింది. సీనియర్లు, జూనియర్లు అనే తావులేకుండా అందరూ సమన్వయం, సమష్టి బాధ్యతతో పని చేసి కాంగ్రెస్​ను అధికారంలోకి తేవాలని సూచించారు. తెలంగాణలో వచ్చే 120 రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధిచిన కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి తెలిపారు. ఈసారి ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థులను ఈ సారి కొన్ని నెలల ముందే ప్రకటించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్​నేత ఉత్తమ్ కుమార్​రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్​తో పొత్తు ఉండబోదని మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ స్పష్టం చేశారు.​

జులై 2.. టెన్షన్ (బాక్స్​)

పొంగులేటి చేరిక సభపైనా చర్చించినట్లు తెలిసింది. వచ్చే నెల రెండున ఖమ్మంలో నాలుగు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్​మార్చ్​ముగింపు కూడా అదే రోజు ఉండడం అధిష్టానాన్ని కాస్త ఇరకాటంలో పడేసింది. పొంగులేటీ చేరికకు రాహుల్ గాంధీ హాజరవుతుండగా, అదే రోజు భట్టి పాదయాత్ర ముగింపు సభ కూడా నిర్వహించాలని మరోవర్గం పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పొంగులేటి సభలో పీపుల్స్​మార్చ్​ను ముగిస్తే పొంగులేటీ చేరిక హైలెట్​అవుతుందని, ఇన్నాళ్లూ భట్టి చేపట్టిన యాత్రకు మైలేజీ లేకుండాపోతుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో వేర్వేరు సభలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఆ రోజు ఖమ్మంలో ఎన్ని సభలు ఉంటాయి?  రాహుల్​గాంధీ ఏ సభకు హాజరవుతారనే చర్చ ఆసక్తికంగా మారింది.