టీమిండియాపై   ఆస్ట్రేలియా 88 పరుగుల  ఆధిక్యం 

టీమిండియాపై   ఆస్ట్రేలియా 88 పరుగుల  ఆధిక్యం 

ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టు 109 పరుగులకే ఆలౌట్ కావడంతో 88 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది ఆస్ట్రేలియా. ఓవర్‌నైట్ స్కోరు 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాకి పీటర్ హ్యాండ్స్‌కోంబ్, కామెరూన్ గ్రీన్ కలిసి శుభారంభం అందించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో మొదటి గంటలో టీమిండియాకి వికెట్ దక్కలేదు.   98 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ని అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు హ్యాండ్స్‌కోంబ్. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ మ్యాజిక్ చూపించాడు. 57 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 1 పరుగు చేసిన మిచెల్ స్టార్క్‌ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టాడ్ ముర్ఫీని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో వెంటవెంటనే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా... 5 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ని రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి 197 పరుగుల వద్ద తెరపడింది.

ఒకానొక దశలో 186/4 స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా, 5.3 ఓవర్లు ముగిసే సరికి 197/10 స్థితికి చేరుకుంది. ఆఖరి 6 వికెట్లను 12 పరుగుల తేడాలో కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు..  భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో మూడేసి వికెట్లు తీయగా ఆస్ట్రేలియా కోల్పోయిన మొదటి 4 వికెట్లు రవీంద్ర జడేజా పడగొట్టాడు. ట్రావిస్ హెడ్ 9, ఉస్మాన్ ఖవాజా 60, మార్నస్ లబుషేన్ 31, స్టీవ్ స్మిత్ 26 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యారు..ఉమేశ్ యాదవ్ స్వదేశంలో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరుపున కపిల్ దేవ్ స్వదేశంలో 219, జవగళ్ శ్రీనాథ్ 108, జహీర్ ఖాన్ 104, ఇషాంత్ శర్మ 104 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. ఉమేశ్ యాదవ్ తన టెస్టు కెరీర్‌లో 164 వికెట్లు తీస్తే అందులో 101 వికెట్లు ఇండియాలోనే రావడం విశేషం.. స్వదేశంలో 24.5 యావరేజ్‌తో వికెట్లు తీసి సంచలన ప్రదర్శన ఇచ్చాడు ఉమేశ్ యాదవ్.  ఓవరాల్‌గా 688 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 687 వికెట్లు తీసిన కపిల్ దేవ్‌ని అధిగమించిన అశ్విన్, అనిల్ కుంబ్లే 956 వికెట్లు, హర్భజన్ సింగ్ 711 తర్వాతి స్థానంలో ఉన్నాడు.  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 33.2 ఓవర్లలో 109 పరగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ 22 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.