బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ.. 

బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ.. 

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.  కిరాణా దుకాణంలో కూర్చున్న బాలుడిని బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు. గంజాయి గ్యాంగ్‌ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు.  

ఒంటిపై గాయాలు చూసిన బాలుడి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ''నీకు దిక్కున్న చోట చెప్పుకో.. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం'' అని గ్యాంగ్‌ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.