దక్షిణాది దేశాల తరఫున గళం వినిపించేందుకు భారత్ ప్రయత్నం

దక్షిణాది దేశాల తరఫున గళం వినిపించేందుకు భారత్ ప్రయత్నం

దిల్లీ: ప్రపంచ స్థాయి సంస్థలు లేదా వేదికలు వైఫల్యం చెందాయనడానికి ఇటీవలి పరిణామాలే నిదర్శనమని ప్రధాని నరేందమోదీ  అన్నారు.  దీని ప్రతికూల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతోందని అంతా అంగీకరించాలన్నారు. భారత్ అధ్యక్ష హోదాలో దిల్లీలో జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ సదస్సునుద్దేశించి గురువారం మోదీ ప్రసంగించారు. దక్షిణాది దేశాల తరఫున గళం వినిపించేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు.'ప్రపంచ దేశాల మధ్య తీవ్రస్థాయి విభజన ఉన్న సమయంలో మనం ఈ సమావేశంలో పాల్గొన్నాం. ఆర్థిక సంక్షోభం, పర్యావరణ మార్పులు, మహమ్మారి, ఉగ్రవాదంతో ఎదురైన పరిస్థితులతో ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. సంవత్సరాల తరబడి సాధించిన పురోగతి తర్వాత.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మనం వెనక్కి వెళ్లే ప్రమాదముంది.

తమ ప్రజలకు ఆహార, ఇంధన భద్రతపై భరోసా కల్పించే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పులు పోగుపడుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతున్న  ధనిక దేశాల వల్ల ఈ దేశాల పై పెను ప్రభావం పడుతోంది. అందుకే భారత్‌కు లభించిన జీ20 అధ్యక్ష బాధ్యతలతో దక్షిణాది దేశాల తరఫున గళం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని ప్రధాని వ్యాఖ్యానించారు. తన చర్యలతో ప్రభావితమైన దేశాల మాట వినకుండా ఏ దేశమూ లీడర్‌గా ప్రకటించుకోలేదన్నారు. మనల్ని వీడదీసే వాటిపైనే కాకుండా ఏకం చేసేవాటిపైనే మనం దృష్టిపెట్టాలని హితవు పలికారు. వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ఆహార, ఇంధన ఆహార భద్రత సవాళ్లను తగ్గించడానికి ప్రపంచం జీ20 వైపు  చూస్తోందన్నారు.  రాష్ట్రపతి భవన్ కల్చరల్‌ సెంటర్‌లో జరుగుతోన్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ గ్రూప్‌ దేశాలతో పాటు మరికొన్ని మిత్రదేశాలను భారత్ ఆహ్వానించింది. ఇక్కడ ఉక్రెయిన్‌ అంశమే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.