అటో! ఇటో!! ఇదే ఆఖరు మోఖా

అటో! ఇటో!! ఇదే ఆఖరు మోఖా
  • బీఆర్ఎస్​సెకండ్​కేడర్ అంతర్మథనం
  • ఉద్యమం నుంచి ఉన్నవారిలో ఆందోళన
  • తమను గుర్తించడం లేదంటూ ఆవేదన
  • లక్షలు ఖర్చు పెడుతున్నా ఫలితం లేదాయే!
  • అధికారంలో ఉన్నవారితోనూ ఇబ్బందులు
  • తమను చిన్నచూపు చూస్తున్నారనే భావన
  • ఇంకా ఎన్నేండ్లు వెయిట్ చేయాలని ప్రశ్న
  • ఈసారి టికెట్ రాకుంటే ప్రత్యామ్నాయమే
  • పెద్లలకు విన్నవించుకుంటున్న నేతలు
  • నియోజకవర్గాలలో పోటాపోటీ కార్యక్రమాలు

అధికార పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు అంతర్మథనంలో పడ్డారు. యేండ్ల తరబడి ఉద్యమంలో ఉన్నా, పార్టీ కోసం పని చేసినా ఇప్పటికీ గుర్తింపు లేకపోవడంతో ప్రత్యామ్నాయ వేదికను వెతుక్కుంటున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుంటూ రాజకీయంగా నెట్టుకు వస్తున్నా ఎలాంటి ఫలితం ఉండడం లేదనే వేదన వారిని వెంటాడుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా ఉండటం, పార్టీని పట్టుకుని వేలాడుతున్న తమకు ఇంత వరకూ ఎలాంటి పదవి రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

పెద్దలూ కనికరించలే!

కూకట్ పల్లి, ఖైరతాబాద్, జనగామ, పరకాల, వరంగల్, హన్మకొండ, దేవరకొండ, కరీంనగర్, రామగుండం, మహబూబ్​నగర్, తుంగతుర్తి వంటి నియోజకవర్గాలలో ఇలాంటి వర్గ విభేదాలే బయటపడుతున్నాయి. ఆయా పార్టీల నుంచి వచ్చిన వారు తమకు అన్యాయం చేశారని, ఇదే సమయంలో పార్టీ అధిష్టానం నుంచి కూడా తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే ఆందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని, ఈసారి తమకే టికెట్​ ఇవ్వాలని పెద్దలకు చెప్పుకుంటున్నారు. తాము కూడా బలంగా ఉన్నామని నిరూపించుకునేందుకు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, బైక్​ ర్యాలీలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో:రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  మూడోసారి కూడా అధికారం కోసం పాట్లు పడుతున్నది. ఆరు నెలలలోపే ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే ఆ పార్టీ నేతలు ఓట్ల వేటలో పడ్డారు. అయితే, ఈసారి వారికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన తప్పేలా లేదు. కొందరు ఎమ్మెల్యేల మీద ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ నేతలనే అణగదొక్కుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. బీఆర్ఎస్​ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి వలసలు పెరిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఇబ్బడిముబ్బడిగా చేరిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో 80 శాతం ఇతర పార్టీ నేతలే. బీఆర్ఎస్​అధికారంలోకి వచ్చిన తర్వాత చేరినవారే. టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పని చేసినవారు కూడా తదనంతరం గులాబీ కండువా కప్పుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎదిగిపోయారు. ఉద్యమం నుంచి పార్టీ జెండా మోస్తున్నవారు చాలా మంది గుర్తింపు లేకుండా ఉన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా తమ రాజకీయ భవిష్యత్తు కష్టమేనని వారు భావిస్తున్నారు. ఈసారైనా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. రాష్ట్ర పర్యటనలకు వెళ్లిన మంత్రి కేటీఆర్​కు ఇవే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఉండటం, తమను చిన్నచూపు చూస్తుండటంతో తట్టుకోలేకపోతున్నామంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలలో బీఆర్ఎస్​లో వర్గాలు ఏర్పడ్డాయి. ఉద్యమం నుంచి జెండా మోస్తున్నవారంతా ఒక వర్గం, మధ్యలో వచ్చిన వారు మరో వర్గంగా మారిపోయారు. 

ఉండుడా! పోవుడా?

ప్రస్తుతం సెకండ్ కేడర్​నేతలంతా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. వచ్చే రెండు నెలలు కీలకంగా భావిస్తున్నారు. సెగ్మెంట్లో బల నిరూపణకు దిగుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న చోట ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నేతల మధ్య విభేదాలు బీఆర్​ఎస్​ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. చాలా నియోజకవర్గాల నుంచి ఈ పరిస్థితులు ఎక్కువగా ఉండటంతో వారిని బుజ్జగించడం కత్తిమీద సాములా మారింది. నేతలను సమన్వయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నది. కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, వారి అనుచరుల దందాలు ఓటర్లను దూరం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలలో కమీషన్ల వసూల్ కూడా పార్టీ ఇమేజ్​ను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్​తో పార్టీకి కష్టమని అధిష్టానం దృష్టికి వచ్చింది. దీంతో వారిని సముదాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా సఫలం కావడం లేదు. ఇటీవల హుజురాబాద్​ సెగ్మెంట్​లో ఇదే తరహా బహిరంగంగా గొడవలు జరుగడంతో గెల్లు శ్రీనివాస్​కు కార్పొరేషన్​ పదవిని అప్పగించారు. అయినప్పటికీ అక్కడ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉన్నా.. వారందరికీ పదవులతో సంతృప్తిపర్చడం కష్టమే. ఎన్నికల తరుణంలో లీడర్ల మధ్య పంచాయితీ పార్టీ అధిష్టానానికి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది.