బంగారు తెలంగాణకు దిక్సూచి సిద్దిపేట

బంగారు తెలంగాణకు దిక్సూచి సిద్దిపేట
  • పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి పెద్ద పీట
  • కెసిఆర్ హైట్రిక్ సీఎంగా మళ్ళీ రావాలి
  • హరీష్ రావుకు లక్షన్నర మెజారిటీ ఇవ్వాలి
  • సిద్దిపేట పర్యటనలో రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: తెలంగాణ రావడానికి సిద్దిపేట గడ్డ ఇచ్చిన మద్దతే కారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కెసిఆర్ నేతృత్వంలో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధి వ్యవసాయ రంగం అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలబడ్డదని కేటీఆర్ చెప్పారు. సిద్దిపేట స్ఫూర్తిగానే బంగారు తెలంగాణను సాధించు కుందమన్నారు.గురువారం నాడు సిద్దిపేట పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నాగుల బండ వద్ద ఐటీ టవర్ ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో విద్యార్థులు యువకులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  1980 నుంచి స్థానిక ఎమ్మెల్యేగా కెసిఆర్ చేపట్టిన పథకాలే నేడు వివిధ రూపాల్లో రాష్ట్రంలో అమలవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. దళిత బంధు, హరితహారం, మంచినీటి పథకాలు సిద్దిపేటలో ఆనాడు ప్రారంభించినవేనని చెప్పారు. సిద్దిపేట దేశానికి స్ఫూర్తిగా మారే కార్యక్రమాలను చేపట్టిందని, బంగారు తెలంగాణకు సిద్దిపేట  దిక్సూచిగా మారనుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను, లక్షన్నర మెజారిటీతో హరీష్ రావును గెలిపించాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 56 వేల కోట్ల ఐటి ఎగుమతులు ఉండగా, ప్రస్తుతం 2, లక్షల 41 వేల కోట్ల ఎగుమతులు ఐటీ రంగంలో  జరిగాయన్నారు అన్నారు. అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు ఐటి రంగాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ప్రోత్సహిస్తుందని కేటీఆర్ వివరించారు. ఉద్యోగాల విషయమై కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలో కేవలం 59 లక్షల ఉద్యోగాలే ఉన్నాయని, 142 కోట్ల జనాభాకు ఈ ఉద్యోగాలు లెక్కిస్తే 0.5% మాత్రమే ఉద్యోగ కల్పన కేంద్ర ప్రభుత్వం చేయగలిగిందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 6.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.ఒకప్పుడు బెంగుళూరు, హైదరాబాద్ పిల్లలకు మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించే వని, ఇప్పుడు జిల్లాలు మండలాలు, గ్రామాల విద్యార్థులకు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించేలా మంత్రి హరీష్ రావు కృషి చేయడం అభినందనీయమన్నారు. సిద్ధిపేట ఐటి టవర్ విస్తరణకు మరిన్ని నిధులు వెంటనే కేటాయిస్తానని చెప్పారు. టాస్క్ ద్వారా పిల్లల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ పాత జిల్లా కేంద్రాలకే పరిమితమైన ఐటీ టవర్ ను తాలూకా కేంద్రమైన సిద్దిపేటకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు సిద్ధిపేట బిడ్డ ముఖ్యమంత్రి కావడం వల్లే ఇంత ప్రగతి సాధ్యమైందని చెప్పారు తెలంగాణ జాతిని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నేత కేసిఆర్ అని కొనియాడారు సిద్దిపేటలో కేసీఆర్ వేసిన బాటల్లోనే నేను ముందుకు సాగుతున్నానని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట ప్రగతి యాత్రలో ఎటు చూసినా కెసిఆర్ అడుగులే కనిపిస్తాయి అన్నారు. ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలో కోట్లాదిమందికి పరిచయం చేసిన ఘనత మంత్రి కేటీఆర్ కు దక్కుతుందని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటకు ఐటీ టవర్ రావడం వల్ల స్థానిక పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయని హరీష్ రావు తెలిపారు. ప్రగతి కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.ఈ బహిరంగ సభలో సిద్దిపేటలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసుకున్న సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులకు మంత్రులు శాలువాలు కప్పి సన్మానించారు. మెమొంటోలు అందజేశారు. విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సభలో ఐటి శాఖ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్, టి ఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిపాలనా అధికారులు పాల్గొన్నారు.