సాహితీ విమర్శకుడు బాల శ్రీనివాసమూర్తి ఇకలేరు.

సాహితీ విమర్శకుడు బాల శ్రీనివాసమూర్తి ఇకలేరు.
  • గుండెపోటుతో మృతి 
  • తెలంగాణ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ 
  • వర్తమాన సాహిత్యానికి తీరని లోటు అన్న కవులు రచయితలు

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సాహితీ విమర్శకులు, వక్త, పరిశోధకులు, తెలంగాణ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, సిద్ధిపేట ముద్దు బిడ్డ డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి  సోమవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు.
తెలుగు సాహిత్యంలో వారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేని దని తెలంగాణ కవులు, గాయకులు కళాకారులు, సాహితీవేత్తలు ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పూర్వపు మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా పూర్వపు దుబ్బాక మండలం ప్రస్తుతం భూంపల్లి అక్బర్ పేట మండల పరిధిలోని పోతారెడ్డి పేట గ్రామంలో అష్టావధాని డాక్టర్ గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ కుమారునిగా డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాస శర్మ 1966 సెప్టెంబర్ ఐదున జన్మించారు. వారి విద్యాభ్యాసం స్వగ్రామమైన పోతారెడ్డిపేట, రామాయంపేట, చిన్నకోడూరు, సిద్దిపేట ప్రాంతాల్లో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించారు.

ఆ తర్వాత హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, పీహెచ్డీలు చేశారు. కవిగా రచయితగా పరిశోధకులుగా సాహితీ విమర్శకునిగా సేవలందిస్తూనే అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.నాటి నుంచే రచన వ్యాసాంగము కలిగిన గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి అష్టావధాని అయిన తండ్రి  గుమ్మన్నగారి  లక్ష్మీనరసింహ శర్మ  వారసత్వానికి వన్నెతెస్తూ ఎదిగిన సాహితీమూర్తి అని చెప్పవచ్చు.  సాంప్రదాయ, ఆధునిక విమర్శనా రీతుల్ని అధ్యయనం చేసిన ప్రామాణిక సాహితీ విమర్శకునిగాను ఎదిగారు. పరిశోధన గ్రంథాలు రాశారు.

తెలంగాణ అస్తిత్వానికి అద్దం  పడుతూ "ఆత్మకథల్లో అలనాటి తెలంగాణ"  "తెలంగాణం తెలుగు  మాగాణం"పరిశోధనా గ్రంథాలను అందించారు. "ప్రసిద్ధిపేట "అనే పేరుతో  సిద్దిపేట జ్ఞాపకాలను అందమైన పుస్తకం రాశారు.దార్శనికుడైన మాజీ ప్రదాని పివీ నరసింహ రావు గారి జీవిత చరిత్ర పై శ్రీనివాసమూర్తి తెలుగులోరచించిన 'విలక్షణ పీవీ' పుస్తకాన్ని 2022 ఏప్రిల్ 23న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  ఆవిష్క రించారు. తండ్రి అందించిన సేవలను గురించి తన బాల్యపు అడుగుజాడల గురించి "స్మృతి పదిలం" పేరుతో పుస్తకాన్ని రచించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం మరో పుస్తకాన్ని అందించారు. బాల శ్రీనివాస్ మూర్తికి భార్య శైలజ, కుమారుడు సాయి గౌతమ్,కుమార్తె హంసిక ఉన్నారు.

 ఆప్తుని కోల్పోయామన్న కవులు, రచయితలు

సాహితీ విమర్శకులు రచయిత డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి ఆకస్మిక మృతి తమకు, వర్తమాన సాహిత్యానికి తీరని లోటని, తాము ఆప్తుని కోల్పోయామని మంజీరా కవులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు వేరువేరు ప్రకటనల్లో తెలిపారు. బాల శ్రీనివాసమూర్తి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ అందరూ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. శ్రీనివాసమూర్తి ఆకస్మిక మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, మంజీర కవి ప్రస్తుత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం జిల్లా కార్యదర్శి సిద్దంకి యాదగిరి,ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డి, జర్నలిస్టుల సంఘం నేత కే రంగాచారి,కే అంజయ్య, మరసం నేతలు నందిని భగవాన్ రెడ్డి, తైదల అంజయ్య, పప్పుల రాజిరెడ్డి తదితరులు ఉన్నారు మేడ్చల్ జిల్లాలోని సుచిత్ర వద్ద బాల శ్రీనివాసమూర్తి పార్థివ దేహాన్ని ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఏనుగు నరసింహారెడ్డి తో పాటు ఉస్మానియా మాజీ వైస్ ఛాన్స్లర్ ఎస్వీ సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ అధికారి లింబాద్రి, అయాచితం నటేశ్వర శర్మ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. బాల శ్రీనివాసమూర్తి మరణం పట్ల పీహెచ్డీ విద్యార్థులు లాల్ బహుదూర్ శాస్త్రి మరికొందరు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.