సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రం ప్రారంభం

సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ముద్ర సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రం ను టీఎస్ పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి ప్రతిబింబించేల ఎంతో ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఆడపడుచుకు నూతన వస్త్రాలను అందించాలనే మంచి ఆలోచనతో, అదేవిధంగా పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ రంగాలలోనీ కార్మికులకు ఉపాధి మార్గాలను చూపాలన్న ఉద్దేశ్యంతో రూపొందించిన పథకమే ఈ బతుకమ్మ చీరల పంపిణీ పథకం అని అన్నారు. మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల జీవితాలను చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా కార్మికులకు ఉపాధి మార్గాలను చూపాలన్న లక్ష్యంతో కార్మికులకు దాదాపు 18 వేల నుండి 20 వేల వరకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ఈ పథకాన్ని రూపకల్పన చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారని అన్నారు. 

2017 సంవత్సరం నుండి నేటి వరకు 6 సార్లు విజయవంతంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసి నేడు 7 వ సారి కూడ కార్మికుల ద్వారా బతుకమ్మ చీరలను తయారు చేయించి, బతుకమ్మ చీరల కొనుగోలు కేంద్రం ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ సంవత్సరం దాదాపు 25 రకాల రంగులతో 25 రకాల డిజైన్లతో  బతుకమ్మ చీరలను తయారు చేయడం జరిగిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో బతుకమ్మ చీరలను కొనుగోలు చేసి  అనంతరం ప్యాకింగ్ రవాణా తదితర పనులన్నీ పూర్తి చేసుకొని పండగ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు బతుకమ్మ చీర అందేలా మంత్రి కేటీఆర్ ప్రణాళిక బద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏ.డి సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు వెల్దండి దేవదాసు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండలి సత్యం, ఎస్.ఎస్.ఐ మాక్స్ సంఘాల యజమానులు, కార్మికులు మరియు చేనేత జౌలీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.