దేశ సంక్షేమం.. అన్ని వర్గాలకు న్యాయం..

దేశ సంక్షేమం.. అన్ని వర్గాలకు న్యాయం..

బిజెపితోనే సాధ్యం బిజెపి జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: దేశ సంక్షేమం అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని బిజెపి జాతీయ కార్యదర్శి, తెలంగాణ సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్ అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం సిద్దిపేటలోని రైస్ మిల్ అసోసియేషన్ లో బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అరవింద్ మీనన్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్ కా సాత్  సబ్ కా వికాస్ అనే నినాదంతో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందన్నారు. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురుగా 2023 -24 సీజన్ కు పలు పంటల మద్దతు ధరలు పెంచి రైతులకు భరోసా ఇచ్చిందని తెలిపారు.

త్రిబుల్ తలాక్ చట్టం తీసుకువచ్చి ముస్లిం మహిళలకు న్యాయం చేసిందని చెప్పారు. అయోధ్యలో ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రామ మందిరం నిర్మాణానికై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించిందన్నారు.కరోనా కష్టకాలం నుండి నేటి వరకు ఉచితంగా పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రంలో ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న హంగామా వల్ల కోట్లాది ప్రజాధనం వృధా అవుతుందని విమర్శించారు.రైతులకు ఏం చేశారని ఉత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.రహదారుల విస్తరణకు కేంద్రం తెలంగాణకు కోట్లాది రూపాయలు ఇచ్చిందన్నారు.అమృత పథకంలో భాగంగా సిద్దిపేట అభివృద్ధికి కూడా కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని ఆయన చెప్పారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అత్యధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని అరవింద్ మీనన్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిరిసిల్ల ఇంచార్జ్ గంగాడి మోహన్ రెడ్డి, విద్యాసాగర్, వంగ రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ఉపేందర్ రావ్, చంద్రశేఖర్,భూపతి, చింత సంతోష్,పత్రి శ్రీనివాస్,వెంకటేశం, శ్రీనివాస్,గుండ్ల జనార్ధన్, బైరీ శంకర్, వేణుగోపాల్, అరునారెడ్డి,ఇంద్రాణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.