ఇప్పుడు అడుగుతున్న ఆ మూడు సమస్యలపై ఎప్పుడు మాట్లాడతారు

ఇప్పుడు అడుగుతున్న ఆ మూడు సమస్యలపై ఎప్పుడు మాట్లాడతారు

 ఆంధ్ర పాలకులకు మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్నలు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: ఆంధ్రాలో సమస్యల రాజ్యమేలుతున్న ఆ రాష్ట్ర నాయకులు మౌనంగా ఎందుకు ఉంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా పెండింగ్లో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించు కుంటారని మంత్రి హరీష్ రావు అడిగారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేసుకుంటారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా ఎలా కాపాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇంకెప్పుడు సాధిస్తారు అంటూ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ లీడర్లు కడిగిపారేశారు. తాను మాటవరసకు అన్నదాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు పై విషయాలపై మాట్లాడాలని హితవు పలికారు. సోమవారము సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో జరిగిన సిద్దిపేట అర్బన్ మండల. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్ రావు పాల్గొని  ప్రసంగించారు. ముందుగా చారిత్రక రంగదాంపల్లి వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నుండి బైక్ ర్యాలీపై మిట్టపల్లికి విచ్చేశారు. మిట్టపల్లిలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు.

అనంతరం విశాలమైన గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో హరీష్ రావు పాల్గొన్నారు. తాను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. కొంతమంది మేస్త్రీలు ,ఇతర కార్మిక వర్గం ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి ఇక్కడ నివసిస్తున్నందున ఇటు అటు వెళ్లడం ఇబ్బంది అవుతుందని చెప్పగా వాళ్లకు తాను మాటవరసకు ఇక్కడే ఉండిపోండి. మా స్కీం ఎన్నో ఉన్నాయి. మీరు వినియోగించుకోండి అని చెప్పిన సందర్భాన్ని ఆంధ్ర నేతలు సిలువలు పలువలు చేసి రాద్ధాంతం చేసి తనపై అడ్డగోలు విమర్శలు చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో తమ అభివృద్ధి యాత్ర కొనసాగుతూనే ఉందని, ఆంధ్ర ప్రాంతంలోని సమస్యల పైన కూడా బిఆర్ఎస్ దృష్టి సారించిందని, అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  బిఆర్ఎస్ పోరాటం చేపట్టిందని తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ ఎనిమిదేళ్ల పాలనలో 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టగా, తాము తెలంగాణలో అటు ప్రాజెక్టులు ,ఇటు దేవాలయాలు కడుతూ జాతి గర్వించదగ్గ నేతల విగ్రహాలను పెడుతున్నామని హరీష్ రావు అన్నారు. కేంద్రం ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణకు చేసిన ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథకం ఇవ్వలేదన్నారు. ఒకవేళ చేసిన మంచి పని ఏదైనా ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి వాళ్లు మాట్లాడితే బూతులే వస్తున్నాయని చెప్పారు.

కేంద్రం గత 8 ఏళ్లలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడం కాకుండా, రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోవడానికి కారణమైందని హరీష్ రావు ధ్వజమెత్తారు. తాను జీవితాంతం సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని దేవుడు ఎంత శక్తినితే అంత  సేవ చేస్తానని అన్నారు. వ్యవసాయ విద్యుత్ అభివృద్ధి సంక్షేమ రంగాలలో కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఆయా రాష్ట్రాల నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.పార్టీ కార్యక్రమాల ఇన్చార్జి బోడకుంటి వెంకటేశ్వర్లు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, సిద్దిపేట అర్బన్ జెడ్పిటిసి తుపాకుల ప్రవళిక చంద్రకాంత్, ఎంపీపీ అధ్యక్షురాలు వంగ సవిత ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట అర్బన్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు జీడిపల్లి కమలాకర్ రావు, అర్బన్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు యాదగిరి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చంద్రకళ, మాజీ జెడ్పిటిసి సభ్యులు తుపాకుల బాలరంగం, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ వంగ నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, మిట్టపల్లి సర్పంచ్ వంగ లక్ష్మీ నరసింహ రెడ్డి,మాజీ సర్పంచ్  రాములు, పొన్నాల సర్పంచ్ తన్నీరు రేణుక శ్రీనివాస్, ఎనసానిపల్లి సర్పంచ్ రవి గౌడ్, తడకపల్లి సర్పంచ్ అంబటి మంగా భాస్కర్ గౌడ్,నాంచార్ పల్లి సర్పంచ్ కొన్నే కల్పన నర్సింలు, ఎల్లుపల్లి సర్పంచ్  జయశ్రీ రమేష్, వెల్కటూరు సర్పంచ్ మల్లమరి ఎల్లవ్వ, మందపల్లి సర్పంచ్ కొమ్ము రాజయ్య,  కృష్ణ సాగర్ సర్పంచ్ భూసాని రాజయ్య, ఎంపీటీసీ సభ్యులు ఆయా గ్రామాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్ పల్లి గ్రామానికి చెందిన మైత్రి అనే బాలిక ఎరుకల నాంచారమ్మ వేషంలో వేదికపైకి వచ్చి హరీష్ రావు యొక్క సోది (జాతకం) చెబుతూ కెసిఆర్ కాబోయే ప్రధాని అని, హరీష్ రావు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పారు. నియోజకవర్గంలో హరీష్ రావు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సోది ద్వారా విపులంగా వివరించారు. 

గజమాలతో హరీష్ రావుకు సన్మానం 


సిద్దిపేట అర్బన్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు పార్టీ యువ నాయకులు, టిఆర్ఎస్వి నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు .హరీష్ రావు బరువుకు తగ్గ గులాబీ పూలతో తయారుచేసిన దండతో యువకులు సన్మానించారు .