కలెక్టరేట్ గేటు బయట బైఠాయింపు

కలెక్టరేట్ గేటు బయట బైఠాయింపు
  • పనులు చేసాం పైసలేవి..
  • కలెక్టరేట్ కు తరలివచ్చిన సర్పంచులు...
  • నిధుల విడుదలకై సర్పంచుల డిమాండ్..

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ సర్పంచులు పోరుబాట పట్టారు.తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు కలెక్టరేట్ ఏవో రహమాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత యాదగిరి మాట్లాడుతూ సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశారని,వీటికి బిల్లులు రాక అప్పులపాలయి ఆత్మ హత్యే శరణంగా భావిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు చెల్లించాల్సిన ఎస్ఎఫ్ సి, పిఎఫ్ఎంఎస్ నిధులను సుమారు 9 నెలలు గడుస్తున్నా.

జమ చేయకపోవడంతో సిబ్బంది జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, ట్రాక్టర్ ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని వెంటనే జమ చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, అలాగే పెండింగ్లో ఉన్న స్మశాన వాటికలు,పల్లె ప్రకృతి వనాల, ప్లేగ్రౌండ్స్ బిల్లులు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరారు  ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, లతా మధుసూదన్ రెడ్డి ,చెరుకు రమణారెడ్డి, తాడూరి రవీందర్, సనాధి సభిత భాస్కర్, శివకుమార్, బండి శ్రీనివాస్, లావణ్య నరసింహారెడ్డి, కోనాయిపల్లి సురేందర్ రెడ్డి ,ముత్యంపేట రాజు, శ్యామల కుమార్, స్వప్న, పూర్ణ కేత కనకరాజు తదితరులు పాల్గొన్నారు