సిద్దిపేటను ముద్దాడిన మల్లన్న సాగర్ మంచి నీరు

సిద్దిపేటను ముద్దాడిన మల్లన్న సాగర్ మంచి నీరు
  • రింగు మెయిన్ పైప్ లైన్ ట్రయల్ రన్ సక్సెస్
  • అటు మానేరు,ఇటు మల్లన్న సాగర్ నీటితో సిద్దిపేటకు జల హారతి
  • నాడు కెసిఆర్..నేడు హరీష్ రావు కృషి ఫలితం
  • 'ముద్ర ప్రతినిధి' క్షేత్రస్థాయి పరిశీలన 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట పట్టణానికి మల్లన్న సాగర్ మంచినీరు అందింది. పట్టణం చుట్టూ వేసిన రింగ్ మెయిన్ పైపులైన్ నుంచి చేసిన చేసిన ట్రయల్ రన్ విజయవంతమైంది. జిల్లా కేంద్రవాసుల నీటి కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి. మంత్రి హరీష్ రావు ప్రత్యేక కృషి వల్ల ఇది సాధ్యమైంది. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా లోయర్ మానేరు జలాశయ నీటిని సిద్దిపేట కు కేసీఆర్ అందించగా, భవిష్యత్తు అవసరాల కోసం మల్లన్న సాగర్ మంచినీటిని పట్టణానికి నేడు మంత్రి హరీష్ రావు అందించారు.  ఒకప్పుడు 11 లో- లెవెల్, ఐ-లెవెల్ ట్యాంకులతో పట్టణ ప్రజలకు సిద్దిపేట మున్సిపాలిటీ వారు మంచినీటినీ అందించేవారు. ఇప్పుడు 61 ట్యాంకుల ద్వారా ప్రజలకు నీటినందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీని ఆఫ్ గ్రేడ్ చేయడంతో సిద్దిపేట సమీప గ్రామాలైన గాడిచర్లపల్లి, లింగారెడ్డిపల్లి, నర్సాపురం, రంగధాంపల్లి,ఇమామ్ బాద్( కొత్తపల్లి)  కేసీఆర్ నగర్ (డబల్ బెడ్ రూమ్ కాలనీ), హరీష్ రావు నగర్లు పట్టణంలో విలీనమయ్యాయి.

దీంతో సిద్దిపేట మున్సిపాలిటీ 43 వార్డులతో భారీగా విస్తరించింది.ప్రస్తుతం 1,48,000 మంది ప్రజలు, 38వేల నివాస గృహాలు,28,600 మంచినీటి నల్ల కనెక్షన్లు పట్టణంలో ఉన్నాయి. పట్టణంలో లో లెవెల్ రిజర్వాయర్లు, హై లెవెల్ రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు 61 ఉండగా వాటి ద్వారా ప్రజలకు రోజు రెండు కోట్ల 5 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ నుంచి 12. ఎం ఎల్ డి నీటిని యష్వాడ సమీపము నుంచి తీసుకుని ఇల్లంతకుంట వరకు పంపింగ్ చేసి కమ్మర్ల పల్లి ఫిల్టర్ బెడ్ లో శుద్ధిచేసి సిద్దిపేటకు తీసుకొస్తున్నారు.

ఇక హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీం నుంచి 8.5 ఎం ఎల్ డి కొండపాక స్టేజి సమీపం నుంచి నీటిని తీసుకొని పట్టణానికి అందించేవారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం పూర్తయిన మల్లన్న సాగర్ తాగు సాగు అవసరాలకు అందుబాటులోకి రావడంతో ఇక ఆ నీటిని సిద్దిపేటకు వాడుకొనున్నారు. మల్లన్న సాగర్ నీటిని కొండపాక మండలం మంగోల్ వద్ద ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ లో  శుద్ది చేసి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా సిద్ధిపేటకు తీసుకువచ్చారు.  పట్టణ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల కోసం సిద్దిపేట రింగ్ మెయిన్  పైప్ లైన్ 700 ఎమ్.ఎమ్ డయా సామర్థ్యం కలిగిన మంచినీటి పైపులైను మిషన్ భగీరథ ద్వారా మంత్రి హరీష్ రావు ఇటీవలే వేయించారు.ప్రస్తుతం ఈ పైప్ లైన్ ద్వారా మల్లన్న సాగర్ నీటిని  సిద్దిపేటలోని లో- లెవెల్, ఐ-లెవెల్ రిజర్వాయర్లకు రెండు రోజులుగా ట్రయల్ రన్ చేయగా విజయవంతం  అయింది.బుధవారం నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది.