ఆన్లైన్ మోసాలపై అందరూ అప్రమత్తంగా  ఉండండి 

ఆన్లైన్ మోసాలపై అందరూ అప్రమత్తంగా  ఉండండి 
  • ఎవరు మోసపోయిన  ధైర్యంగా ఫిర్యాదు చేయండి
  • పనులే చేయకుండా జల్సా చేసే వారిపై ఓ కన్నెయ్యండి
  • ఇక సైబర్ నేరస్తులపై ఉక్కు పాదం మోపుతాం
  • ఆన్లైన్లో బ్లాక్ మెయిల్ చేసే ఘరానా మోసగాళ్లు ఇద్దరు అరెస్ట్
  • విలేకరుల సమావేశంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా రెడ్డి ప్రకటన

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: ఆన్లైన్ మోసాలు చేస్తూ,డబ్బుల కోసం బాధితులను వేధిస్తున్న సైబర్ మోసగాళ్లపై ఇక పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతా రెడ్డి ప్రకటించారు. సైబర్ క్రైమ్ లో  నేరస్తులు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్న తమ శాఖ నుంచి వారు తప్పించుకోలేరని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం నాడు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో సిపి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ఏసిపి పరిధిలో ఉన్న బేగంపేట పోలీస్ స్టేషన్లో నమోదైన సైబర్ క్రైమ్ కేసులో ఘరానా నిందితులిద్దరిని సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు మీడియాకు కమిషనర్ వెల్లడించారు.

సోషల్ మీడియా వేదికగా షేర్ చాట్ ద్వారా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి దాని ద్వారా పలువురిని డబ్బుల కోసం వేధించిన జగిత్యాల పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఆరేపల్లి అభిషేక్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్ద పాపాయ పల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ భాష వేనా అభినాష్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆర్ 15 మోటార్ సైకిల్, మూడు సెల్ ఫోన్లు,8 వేల రూపాయల నగదును రికవరీ చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. షేర్ చాట్ లో అమ్మాయిల ఫోటోలను ప్రొఫైల్ డిపి పిక్చర్ పెడుతూ పలువురిని ఆకర్షించి వారిని క్రమంగా న్యూడ్ ఫోటోలు, వీడియోలు చూసే విధంగా మార్చి తర్వాత వారు బాధితులను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని, డబ్బులు ఇవ్వని వారిపై సైబర్ పోలీస్ పేరుతో బెదిరింపులకు,గురి చేస్తూ కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తూ రాయలేని భాషలో అసభ్య పదజాలంతో దూషిస్తూ నేరగాళ్లు బాధితులని ఎంతగానో టార్చర్ పెట్టారని కమిషనర్ వెల్లడించారు.

ఇటువంటి మోసాలు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా బాధితులు కొందరు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయడంతో ఈ విషయము పోలీసులకు తెలిసిందన్నారు.ఈ ఘటనపై బేగంపేట స్టేషన్లో నమోదైన కేసును తాము సీరియస్ గా తీసుకొని ప్రత్యేకంగా గజ్వేల్ ఏసిపి రమేష్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి విచారణ జరపగా నిందితులు పట్టుబడ్డారని కమిషనర్ శ్వేతారెడ్డి తెలిపారు.అరెస్ట్ అయిన నిందితులనుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలిపారు. నిందితులు 21 సిమ్ కార్డులు వినియోగించారని 10 ఫోన్ల ద్వారా 18000 కాల్స్ చేసి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసినట్లు వెళ్లడైందన్నారు. పలు బ్యాంక్ అకౌంట్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. దాదాపు 5వేల నంబర్లను బ్లాక్ చేశారని ఆమె తెలిపారు. ఈ ఉదంతంలో బాధితులు ఎంతోమంది అన్ని వర్గాల వారు ఉన్నారని వెల్లడించారు.

తమ పరిసరాల్లో పనులే చేయకుండా  సునాయాసంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేస్తూ తిరిగే వారి పైన ప్రజలు ఓ కన్నేసి ఉంచాలని, అటువంటి వారి సమాచారాన్ని తమకు అందించాలని సిపి కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆమె చెప్పారు.కొత్త కొత్త టెక్నాలజీని వాడుతూ హైటెక్ మోసాలకు పాల్పడుతున్న వారు తాము పోలీసులకు పట్టుబడ కుండా ఉండడానికి ఎన్ని ట్రిక్స్ వాడిన వారిని తాము పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని సిద్ధం చేసుకున్నామని సిపి తెలిపారు. తాత్కాలికంగా నేరగాళ్లు దొరకకుండా ఎప్పుడో ఒకసారి వారు పోలీసులకు పట్టుబడక తప్పదని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైన వారెవరు నేరస్తుల బెదిరింపులకు భయపడకుండా

తమ దృష్టికి వెంటనే తీసుకురావాలని సిపి సూచించారు. సైబర్ క్రైమ్ మోసాలపై త్వరలో పాఠశాలల ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడతామని వివరించారు.బేగంపేట కేసు విషయంలో నేరస్తులను పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించిన గజ్వేల్ ఎసిపి రమేష్ తో పాటు తొగుట సిఐ కమలాకర్, బేగంపేట ఎస్సై అరుణ్, కానిస్టేబుల్ రాజు, అనిల్,రామచంద్రారెడ్డి, బసవరాజ్, మహేష్, రవి, వెంకటేష్, హోంగార్డ్స్ రాజు, నగేష్ లను పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందించారు.