దాడులు రాజకీయ కక్షతో కావాలనే చేశారు

దాడులు రాజకీయ కక్షతో కావాలనే చేశారు
  • నా జీవితము, నా వ్యాపారం తెరిచిన పుస్తకం, వైట్ పేపర్
  • నాకున్నది ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ఒక్కటే
  • నాకు ఎవరితో వ్యాపారాలు లేవు
  • మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టీకరణ

ముద్ర ప్రతినిధి సిద్దిపేట: తనపై ఐటి దాడులంటూ టీవీలో వస్తున్న వార్తలకు, వాస్తవానికి అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతనలేదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు, భారత రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'వైద్య ఆరోగ్య దినోత్సవం'లో ఆయన పాల్గొన్నారు. న్యూట్రిషన్ కిట్లను గర్భిణీ స్త్రీలకు అందజేశారు.ఈ సందర్భంగా విలేకరులు ఐటీ దాడులపై వివరణ కోరగా ఘాటుగా స్పందించారు.తాను నిన్నటి నుంచే పోతారంలో ఉన్నానని చెప్పారు. ఎంపీదుబ్బాక మండలంలోని స్వగ్రామమైన పోతారంలో ఉండగా    హైదరాబాదులోని తన ఇంటికి ఐటీ అధికారులు  వచ్చారని కూతురు ఉదయము పూట తెలుపగానే తాను ఐటీ అధికారులతో మాట్లాడారన్నారు. ఏదో ఒక పాత డాక్యుమెంట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసమై సెర్చ్ వారంతో వచ్చామని వారు చెప్పారని ఎంపీ అన్నారు. అది కూడా పై పెద్దల వత్తిడితోటే వచ్చామని వారు చెప్పారని ఆయన అన్నారు. టీవీల్లో మాత్రం తనపై బురదజల్లే కార్యక్రమం గా ఐటీ దాడులు జరుగుతున్నాయని స్క్రోలింగ్లు, బ్రేకింగ్ లు వచ్చాయన్నారు. టీవీల్లో వచ్చిన దానికి వాస్తవంగా జరిగిందానికి ఎక్కడ పొంతన లేదన్నారు. 

ALSO READ: అధైర్యం వద్దు కడిగిన ముత్యంలా బయటికి వస్తా: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి

తాను ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ లో 1986 నుంచి పాన్ కార్డు తీసుకుని వ్యాపారం చేస్తున్నానని అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతిదానికి లెక్కలు ఉన్నాయని చెప్పారు. కొన్నేళ్లుగా మల్టీనేషన్ ట్రాన్స్పోర్ట్  కంపెనీ లతో  ఈ బిజినెస్ చేస్తున్నందున, దానికి సంబంధించి ఐటీ లెక్కలు, జిఎస్టి, సిఎస్టి, టాక్స్లు  అన్ని ఎప్పటికప్పుడు క్లియర్  చేస్తున్నమనీఎంపీ వివరించారు. కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా తన ఇంటికి అధికారులు రాగా ఇల్లంతా చూపించమని తన కూతురికి చెప్పానన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు లేని దాడులను ఎన్నికల ముందు ఎందుకు చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు . బిఆర్ఎస్ పార్టీ శ్రేణులపై గత కొంతకాలంగా జరుగుతున్న దాడులలో భాగమే ఇది అని ఆయన విమర్శించారు. తన జీవితము తెరిచిన పుస్తకం అని తన వ్యాపారం పూర్తిగా వైట్ మనీ అని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనకు ఎవరితో ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. చేసేది ఒకటే వ్యాపారం అని ఉన్నది ఒకటే ఫర్మని ఎంపీ స్పష్టం చేశారు.