మావోయిస్ట్  నేరెళ్ళ జ్యోతి లొంగుబాటు

మావోయిస్ట్  నేరెళ్ళ జ్యోతి లొంగుబాటు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  రాజన్న-సిరిసిల్ల జిల్లా సిపిఐ మావోయిస్టు - డిసియం (ప్రెస్ ఇంచార్జి -తెలంగాణ రాష్ట్ర కమిటి) గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు ముందు లొంగిపోయారు. శుక్రవారం కరీంనగర్ కమిషనరేట్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సి పి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో విప్లవ గీతాలకు ఆకర్షితురాలై నక్సలైట్ గా మారిందన్నారు.   అప్పటి దళ కమాండర్ రఘు ద్వారా దళంలోకి వెళ్ళి  కొద్దిరోజుల పాటు సిరిసిల్ల ఏరియాలో పనిచేసి, మానాల ఎన్ కౌంటర్ జరిగిన తరువాత ఆదిలాబాద్ జిల్లా మంగి దళంలోకి వెళ్ళినట్లు తెలిపారు. అనంతరం జంపన్నతో కలిసి ఒడిశా రాష్ట్రంలో ప్రెస్ కమిటీ మెంబర్ గా పనిచేసింది. పార్టీలో పనిచేస్తూనే ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ ను వివాహం చేసుకుని అతని వేదింపులు భరించలేక 2012 సంవత్సరములో అతని నుండి విడిపోయినట్లు తెలిపారు.   20 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో మావోయిస్టు తీవ్రవాద సంస్థలో మూడు రాష్ట్రాలలో పనిచేసిందని పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ  అనాగరిక ఆలోచనలతో విసుగు చెంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి పనులకు ఆకర్షితురాలై లొంగిపోయినట్లు సీపీ తెలిపారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో కమిటీలను ఏర్పాటు చేసి బలవంతపు వసూళ్ళు, ఆదివాసీలను ప్రలోభపెట్టి, మైనర్లను తీవ్రవాదులుగా తయారు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్పష్టం చేశారు. చైనా, రష్యా లాంటి దేశాలు మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను వదిలి ప్రజాస్వామ్య విధానాలతో, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణలతో అభివృద్ధివైపు దూసుకువెళుతుంటే, మావోయును తీవ్రవాదులు మాత్రం తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందనే బూజుపట్టిన సిద్ధాంతాలతో అమాయక ప్రజలను ప్రలోభ పెట్టి, ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నేరెల్ల జ్యోతి పై ఉన్న 5 లక్షల రూపాయల రివార్డు నగదు, ప్రభుత్వం తరపున పునరావాసం, జీవనోపాధి  అందజేయబడతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో డిసిపిలు చంద్రమోహన్, శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు.