ప్రశ్నిస్తే.... అరెస్ట్ చేస్తారా?

ప్రశ్నిస్తే.... అరెస్ట్ చేస్తారా?
  • నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్ పై బండి సంజయ్ ఫైర్
  • తప్పు చేసిన వాళ్లను వదిలి పోరాడుతున్న వాళ్లను అరెస్ట్ చేయడమేంటి?
  • అరెస్టులు, జైళ్లు మాకు కొత్త కాదు
  • తక్షణమే అరెస్ట్ చేసిన వాళ్లందరినీ విడుదల చేయాలి
  • లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది
  • ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ  బండి సంజయ్ కుమార్ హెచ్చరిక
  • లీకేజీ కేసును సిట్ కు అప్పగించడంపై అభ్యంతరం
  • కేసును నీరుగార్చేందుకు సిట్ కు అప్పగించారని ఫైర్


టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని  ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, అందుకు కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన బీజేవైఎం బేషరతుగా కార్యకర్తలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని గుర్తు చేశారు. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సైతం రాష్ర ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తోందని, అందులో భాగంగానే సిట్ కు అప్పగించారని ధ్వజమెత్తారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.