పాలించే రాజు జాగ్రత్త

పాలించే రాజు జాగ్రత్త

రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శోభకృత నామ సంవత్సర పంచాంగాన్ని మంత్రులు ఆవిష్కరించారు.  అనంతరం శారదాపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్‌ పంచాంగం పఠించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. పెండింగ్‌ బిల్లులన్నింటి కీ క్లియరెన్స్‌ రాబోతోందన్నారు. కొంతమంది వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని, పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది నిండబోతున్నాయన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు మంచి అవకాశాలు కలగనున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలున్నాయన్నారు.

విద్యా శాఖలో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వబోతున్నాయని సంతోష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ ఏడాది ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవాలని సూచించారు. కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర భారతంలో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయని వెల్లడించారు. ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదొడుకులు ఎదురుకానున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆసక్తికరమైన రాజకీయాలను చూడబోతున్నారని తెలిపారు. పోలీసులు బాగా పనిచేసే అవకాశం ఉందన్నారు. ధరలు తగ్గబోతున్నాయని, ఏప్రిల్‌లో విపరీతమైన ఎండలు ఉంటాయంటూ సంతోష్‌ కుమార్‌ శర్మ పంచాంగ పఠనంలో వివరించారు.