పట్టణ ప్రగతికి రూ.1.21లక్షల కోట్లు ఖర్చు చేశాం

పట్టణ ప్రగతికి రూ.1.21లక్షల కోట్లు ఖర్చు చేశాం
  • దేశానికి పల్లెలు పట్టుకొమ్మలైతే.. పట్టణాలు ఆర్థిక ఇంజిన్లు
  • పారదర్శకంగా దశాబ్ది ప్రగతి నివేదిక 
  • పురపాలక అభివృద్ధి నివేదిక ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్
     

ముద్ర, తెలంగాణ బ్యూరో : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలైతే పట్టణాలు దేశానికి ఆర్థిక ఇంజిన్లు అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 మధ్య కాలంలో  ఎంఏయూడీ శాఖ ద్వారా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపల్​పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం రూ.1,21,294 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. 9 ఏళ్లలో పురపాలక శాఖ సాధించిన అభివృద్ధి నివేదికను బుధవారం మెట్రో రైల్ భవన్ లో మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి 70 శాతం ఆదాయం పట్టణాల నుంచే వస్తోందన్నారు. అందుకే పట్టణాల్లో మౌలిక వసతులు కోసం అప్పు తీసుకొచ్చి, దాన్ని భవిష్యత్​కోసం పెట్టుబడిగా పెడుతున్నామన్నారు. ప్రపంచ స్థాయి పట్టణాలకు దీటుగా నగర పౌరులకు వసతులను కల్పిస్తున్నామని, అందుకే రాష్ట్రంలోని పట్టణాలకు కేంద్రం నుంచి అనేక అవార్డులు, రివార్డులు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు పదేళ్లలో ఖర్చు చేసిన నిధుల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 850 శాతం అధికంగా నిధులను ఖర్చు చేసిందని వెల్లడించారు.

అన్ని అంశాలు నివేదికలో పొందుపర్చాం..

2014 నుంచి ఇప్పటి వరకు పురపాలక శాఖ ఖర్చు చేసిన అన్ని అంశాలు ఈ నివేదికలో పొందుపరిచామన్నారు. పురపాలనలో సీఎం కేసీఆర్  మార్గదర్శనంలో వచ్చిన నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతి తదితర కార్యక్రమాలతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఎవరు అడగకున్నా చిత్తశుద్ధితో, పారదర్శకంగా ఉండేలా ప్రతీ ఎడాది నివేదిక విడుదల చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. తొమ్మిదేళ్లలో పుర‌పాల‌క శాఖ ద్వారా రూ.1.21 ల‌క్షల కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. ఈ ప‌దేండ్లలో 462 శాతం ఎక్కువ ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. ఈ ప‌దేండ్లలో చ‌ట్టబ‌ద్ధంగా రావాల్సింది త‌ప్ప కేంద్రం నుంచి అదనంగా రూపాయి కూడా రాలేదని కేటీఆర్​స్పష్టం చేశారు. 

35 ఫ్లై ఓవ‌ర్లు నిర్మించాం..

హైదరాబాద్​న‌గ‌ర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామ‌ని కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్‌డీపీ ద్వారా 35 వ‌ర‌కు ఫ్లై ఓవ‌ర్లు నిర్మించామ‌ని, ఉప్పల్, అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్లను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయ‌లేక‌పోతోంద‌న్నారు. తాము 35 ఫ్లై ఓవ‌ర్లు పూర్తి చేస్తే, వాళ్లు 2 కూడా చేయ‌లేక‌పోతున్నారని ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్‌లో ప్రధాన ర‌హ‌దారుల నాణ్యత పెరిగింద‌న్నారు. నగరంలో ప్రజారవాణాను మెరుగుపర్చడం, మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ర్టిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్​లో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమ్మతు తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

మెట్రో రైలు కోచ్​లను పెంచుతాం..

నగర పాలనలో ప్రజల భాగసామ్యం పెంచడం, వార్డు కమీటీలు ఏర్పాటు, స్వచ్చ బడి ఏర్పాటు, ప్రజలను కలుపుకుని పట్టణాలు రూపురేఖలు మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  ఐదుగురు కేంద్ర మంత్రులు మారినా నగరంలో ప్రజారవాణాకు రక్షణ భూములుంటే ఇవ్వలేదని విమర్శించారు. శామీర్ పేట్, మేడ్చల్ వైపు డబుల్ డెక్కర్ సైవేలు కడతామన్నారు.  మెట్రో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్ లను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కంటోన్మెంట్ ను గ్రేటర్ లో కలపాల్సిన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనన్నారు. ఎస్ఎన్‌డీపీ కింద నాలాల‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 150 కాల‌నీలు గ‌తంలో ముంపు వ‌ల్ల ఇబ్బంది ప‌డేవని.. ప్రస్తుతం ఎస్ఎన్డీపీ వ‌ల్ల ఈ ముంపు బాధ త‌ప్పిందన్నారు. హైద‌రాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ. 238 కోట్లతో 19 ప‌నులు చేప‌ట్టామన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 2050 నాటికి తాగునీటి స‌మ‌స్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఓఆర్ఆర్ ప‌రిధిలో నీళ్లు అందించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామని, సెప్టెంబ‌ర్ నాటికి ఎస్‌టీపీలు పూర్తి చేస్తామ‌ని  కేటీఆర్ తెలిపారు.