ఎన్.ఎం.ఎం.ఎస్ పరిక్షలో 93 శాతం అర్హత  .......

ఎన్.ఎం.ఎం.ఎస్ పరిక్షలో 93 శాతం అర్హత  .......
  • టి-సాట్   కృషి తోనే  ఇది సాధ్యమైంది
  • సీఈవో రాంపురం  శైలేష్ రెడ్డి 

ముద్ర, హైదరాబాద్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్.ఎం.ఎం.ఎస్) పోటీ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు 93 శాతం ఫలితాలు సాధించేందుకు టి-సాట్ ప్రత్యేక కృషి చేసింది. 2022 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పోటీ పరీక్ష కోసం 32,900 మంది విద్యార్థులు నమోదు చేసుకునేందుకు దోహదపడింది. ఫలితంగా 2,716 మంది అర్హత సాధించి వచ్చే విద్యా సంవత్సరానికి మార్గదర్శకంగా నిలిచారు.  ఎన్.ఎం.ఎం.ఎస్ పోటీ పరీక్షలో  విద్యార్థులు అత్యధికంగా అర్హత సాధించేందుకు టి-సాట్ అందించిన ప్రోత్సాహాన్ని సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి సోమవారం  పత్రికా ప్రకటనలో వివరించారు.  

  ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి పూర్తి చేసి 9 వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థుల కోసం ఎన్​సీఆర్​టీ ఆధ్వర్యంలో సంవత్సరానికి రూ.12 వేల ఉపకార వేతనాన్ని అందిస్తోందని, 2023 విద్యాసంవత్సరానికి సంబంధించి టి- సాట్ సహకారంతో తెలంగాణలో 2,716 మంది విద్యార్థులు అర్హత సాధించడం అభినందనీయమని శైలేష్ రెడ్డి కొనియాడారు. 2022 డిసెంబర్ నెలలో జరిగిన పోటీ పరీక్షకు విద్యార్థులను సమాయత్తం చేసేందుకు  మెంటల్ ఎబిలిటీ,  ఫిజికల్ సైన్స్,  మ్యాథ్స్,  బయో సైన్స్, సోషల్ స్టడీస్ లో  100 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేశామన్నారు. ప్రసారాలను విద్యార్థులు నిత్యం ఫాలో అయ్యేందుకు వీలుగా  సంబంధిత జిల్లా  విద్యాశాఖాధికారులతో  చర్చించి షెడ్యూలు నిర్ణయించడం జరిగిందని సీఈవో గుర్తు చేశారు. 2023 డిసెంబర్ లో నిర్వహించే ఎన్.ఎం.ఎం.ఎస్ పోటీ పరీక్షలో  తెలంగాణ విద్యార్థులు 100 శాతం అర్హత సాధించేందుకు  టి-సాట్ తమ వంతు సహకారం అందించనుందని,  రాష్ట్రంలోని  ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని శైలేష్ రెడ్డి కోరారు.