జాబితా తారుమారు!

జాబితా  తారుమారు!
  • సంక్షేమ పథకాల్లో కొత్త పంచాయితీ
  • బీఆర్ఎస్ ​సిట్టింగ్​ఎమ్మెల్యేల ప్లేస్​లో కొత్త అభ్యర్థులు
  • టికెట్లు మార్చిన చోట వివాదాలు
  • పాత జాబితాలు రద్దు.. మళ్లీ కొత్తగా షురూ
  • మారుతున్న లబ్ధిదారులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రాని నియోజకవర్గాల్లో కొత్త వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సంక్షేమ పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితాలు తారుమారు అవుతున్నాయి. పాత జాబితాలను రద్దు చేసి కొత్తగా మళ్లీ తయారువుతున్నాయని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు మారుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గంట మోగేందుకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో పలు సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే సిట్టింగులకు టికెట్లు కట్ చేసిన చోట లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్త జాబితా తయారవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ప్రస్తుతం టికెట్లు దక్కించుకున్న నేతలు సరికొత్త జాబితాలను రూపొందించి సంబంధిత అధికారులకు అందజేస్తున్నారు. కాగా టికెట్లు రాని కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడిన వారికి ఎలాంటి రాజకీయ ప్రయోజనం దక్కకుండా అధికార పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. దీని కారణంగానే ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులు శరవేగంగా మారిపోతున్నారు.

పార్టీపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సీఎం కేసీఆర్ 115 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మరో 4 సెగ్మెంట్లలో అభ్యర్థలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. అయితే ప్రకటించిన అభ్యర్థుల్లో ఎనిమిది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. దీంతో టికెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారు బహిరంగంగానే తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోయినా.. ఎన్నికల బరిలో ఉంటామని పలువురు బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ ముందస్తూ జాగ్రత్తలో నిమగ్నమైంది. పార్టీపై ధిక్కార స్వరం పెంచిన వారికి పథకాల చిక్కులు వస్తున్నాయి. నిధుల నిలిపివేస్తోంది. ప్రధానంగా ఇది ఖానాపూర్, బోథ్, వైరా, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో నెలకొంది. ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. 

పార్టీని వీడేందుకు పలువురు సిద్ధం?

అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వగా.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబుకు వ్యవసాయ శాఖ సలహాదారు పోస్టు ఇచ్చారు. వీరిద్దరు సైలెంట్ అవగా మిగతా చోట్ల ఎమ్మెల్యేలు అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. వైరాలో రాములు నాయక్ అసమ్మతి స్వరం వినిపిస్తుండగా.. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్​రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి పోటీ చేసే అవకాశం లభించింది. అయితే చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయత్నం చేస్తానని.. అప్పటికీ కుదరని పక్షంలో కూడా ఎన్నికల బరిలో ఉంటానని ఆయన పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ కు పిలుపించుకుని రాజయ్యకు నచ్చజెప్పారు. కడియం గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అప్పుడు మాత్రం అంతా ఓకే అని చెప్పి.. మళ్లీ తనకే టికెట్ అంటున్నారు. 

కాంగ్రెస్​లోకి మైనంపల్లి..

కేసీఆర్ ప్రకటించిన జాబితాలో చోటు దక్కినప్పటికీ తన కుమారుడికి పోటీ చేసేందుకు అవకాశం దక్కపోవడంతో రెండు రోజుల క్రితం మల్కాజిగిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు పార్టీని వీడారు. హన్మంతరావు స్థానంలో గతంలో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారు.  ఇక పెండింగ్ లో పెట్టిన నాలుగు స్థానాల్లో నర్సాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాకుండా సునీతా లక్ష్మారెడ్డికి, జనగాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తి యాదగిరి రెడ్డి కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారు. ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్లు రాని నియోజకవర్గాలపై బీఆర్ఎస్​అధిష్ఠానం కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. టికెట్లు దక్కని నేతల మూమెంట్ ను అధిష్టానం ఎప్పటికప్పుడు ఆరా తీసే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు రూపొందించిన లబ్ధిదారుల జాబితా కాకుండా ఎంపిక చేసిన అభ్యర్థులు రూపొందించిన జాబితాను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌకిక ఆదేశాలు కూడా అందాయని తెలుస్తోంది. మొత్తం మీద సిట్టింగ్ శాసనసభ్యులకు టికెట్లు రాకపోవడంతో లబ్ధిదారులు కూడా మారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.