తెలంగాణకు ఎల్లో అలర్ట్!

తెలంగాణకు ఎల్లో అలర్ట్!
  • ఐదు రోజుల పాటు వర్షాలు
  • హైదరాబాద్ లో జలమయమైన కాలనీలు
  • మెట్టుగూడ నాలాలో కొట్టుకుపోయిన మహిళ మృతి

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో వచ్చే రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఈ వర్షానికి సికింద్రాబాద్ మెట్టుగూడలో ఓ పారిశుధ్య కార్మికురాలు వరద ఉధృతికి నాలాలో కొట్టుకుపోయింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది నాలాలో గాలించగా.. అంబానగర్ వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, చార్మినార్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్‌మండి, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్​తోపాటు నిర్మల్, కామారెడ్డి, భద్రాద్రి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. దీంతో గణేశ్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినాయక విగ్రహాలను తీసుకువస్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం ఏర్పడింది. అలాగే హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.