ఆర్టీసీలో చిల్లర సమస్యకు చెక్!

ఆర్టీసీలో చిల్లర సమస్యకు చెక్!
  • త్వరలో నగదు రహిత చెల్లింపులకు వెసులుబాటు
  • పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపై స్థాయి బస్సులన్నింట్లో ఐ–టిమ్స్ 
  • డెబిట్, క్రెడిట్​కార్టులు, ఫోన్​పే, గూగుల్​ పేవంటి వంటి వాటితో చెల్లింపులకు అవకాశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ  ఆర్టీసీలో ఇక నుంచి క్యాష్ లెస్ చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు కలుగునుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐ–టిమ్స్​ పరికరాలను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్, క్రెడిట్​ కార్డులతో పాటు ఫోన్​పే, గూగుల్​పే వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చు.  ఈ మేరకు బండ్లగూడ బస్​ డిపోను పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ–టిమ్స్​ను వాడేందుకు అధికారులు సన్నాహాలు  చేస్తున్నారు. అనంతరం కంటోన్మెంట్​ డిపోలో అమలు చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు. 

టికెట్​ ధర పెంపు అందుకే..
ఆర్టీసీ బస్సుల్లో టికెట్​ తీసుకునేప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు జరుగుతుంటాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం బస్ టికెట్ల ధరలను రూ.10, 15, 20 ఇలా రౌండ్​ ఫిగర్​గా మార్చేసింది. అయినా ఈ సమస్యకు పాక్షింకంగా పరిష్కారమే లభించింది. దూరప్రాంత, అధిక ఛార్జీలుండే 700 సూపర్​ లగ్జరీ, ఏసీ బస్సుల్లోనే ఐ–టిమ్స్​ను ప్రవేశపెట్టగలిగారు. మిగిలిన 8,300 బస్సుల్లో సాధారణ టిమ్స్​మాత్రమే ఉన్నాయి. 

తీరనున్న కష్టాలు..
ప్రస్తుతం దేశం మొత్తం క్యాష్​ లెస్​విధానమే నడుస్తుంది. చిన్న టీ కొట్టు, కూరగాయల మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఈ వెసులు బాటు ఉంది. ప్రజల కూడా ప్రతి దగ్గర యూపీఐని వినియోగించే సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో బస్సు ఎక్కాలంటే మాత్రం కచ్చితంగా  నగదు ఉండాల్సిందే. దీంతో ప్రయాణికులు చాలాచోట్ల ఇబ్బందులు పడిన ఘటనలు కూడా లేకపోలేదు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తప్పనున్నాయి. నగదు రహిత చెల్లింపులతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.