పంటకు జీవం ఇచ్చిన వర్షం  రైతు కళ్ళలో హర్షం

పంటకు జీవం ఇచ్చిన వర్షం  రైతు కళ్ళలో హర్షం
  • గత నెలలో వాడిన చేలు, ఈ నెలలో కళకళలాడిన చేలు
  • రైతుకు ఊరట, భవిష్యత్తుకు బాసట

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఇన్నాళ్లుగా వాడిన చేలకు వర్షం జీవం పోసింది గత నాలుగైదు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అడపా దడపా కురుస్తున్న వర్షం రైతులకు ఊరటనిచ్చింది భవిష్యత్తు పంటలకు బాసటగా నిలిచిందని చెప్పవచ్చు జులై ఆగస్టు నెలలో తక్కువ వర్షపాతంతో  బిక్కుమంటూ గడిపిన రైతన్న  అప్పు సప్పు చేసి వేసిన విత్తనాలు అరకొరగా మొలిచి నీటి కోసం ఆకాశవైపు 
ఆబగా చూసాయి. అయినా ముఖం చాటేసిన వరుణుడు ఆగస్టు నెలలో 122 సంవత్సరాల క్రితం వచ్చిన వర్షపాతలేమిని మరోసారి చూపిస్తూ రైతన్నల ఆశల్ని అడియాసలు చేశాయి. ఆగస్టు వేడి మీ తీవ్రతరం కాగా సెప్టెంబర్ ప్రారంభంతోనే వాతావరణం చల్లబడటం బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం వర్షాలు ధారాళంగా కురవడం పంటలకు జీవకళ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నాయి. మొత్తానికి పత్తి వేరుశనగ పెసర కంది చేలకు వరి పొలాలకు  తిరిగి ప్రాణం పోసినట్టు అయింది. మొత్తానికి పంటలు పూత దశలో ఉండగా ఇప్పటికే 30% వాడిపోయే దశకు చేరుకోగా ఈ వర్షాల వల్ల తిరిగి జీవం పోసుకున్నాయి.

సూర్యాపేట జిల్లాలో 4,60,293 ఎకరాల్లో పంటల సాగు

సూర్యాపేట జిల్లాలో 88,798 ఎకరాల్లో పత్తి 3,64,298 ఎకరాల్లో వరి 2, 303 ఎకరాల్లో కందులు, 419 ఎకరాల్లో పెసర 964 ఎకరాల్లో వేరుశనగ 226 ఎకరాల్లో చెరుకు 027 ఎకరాల్లో మినుములు మొత్తంగా 4,60,293 ఎకరాల్లో పత్తి వేరుశనగ పెసర కంది తదితరుల పంటలు వేయడం జరిగింది. నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలో 65 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు సూర్యపేట జిల్లా హుజూర్నగర్ ప్రాంతంలో బోర్లు బావుల కింద 28 వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు సాగు చేశారు.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి లో అధిక వర్షపాతం

సూర్యాపేట జిల్లా మఠంపల్లి లో గత నాలుగు రోజులుగా వర్షాలకు 35 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాక గరిడేపల్లిలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అత్యధికంగా 28.3% మిల్లీమీటర్లు అత్యల్పంగా అడ్డగూడూరు 5.9% మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది మిర్యాలగూడ మండలంలో 44.3% మిల్లీమీటర్లు అత్యధికంగా దేవరకొండ డివిజన్లో 14.8% మిల్లీమీటర్లు చింతపల్లి మండలంలో అత్యధికంగా దేవరకొండలో 10 మిల్లీమీటర్ల వర్షపాతం కోదాడ డివిజన్లో 30.3% మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి

ప్రాజెక్టుల్లోకి చేరుతున్న నీరు

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిన్న మధ్యతర ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయి 175 అడుగులు(45.77 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 156.62 అడుగులు( 21.84 టీఎంసీలు) నీరు నిలువ ఉండగా 3180 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. డిండి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులుగా( 2.4 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం 16 అడుగులు ఉండగా ఎనిమిది వేల క్యూసెక్కుల 700 క్యూసెక్కుల ఇంట్లో కొనసాగుతుంది. సూర్యాపేట వద్ద గల మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టిఎంసి) కాగా ప్రస్తుతం 643.50 అడుగులు (4.007 టిఎంసిలు) నీరు నిల్వ ఉండగా దిగువకు 5576.75 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో పాటు కుడి ఎడమ కాలువల ద్వారా ప్రతి కాల్వకు 167. 58 క్యూసెక్కుల నీటి చొప్పున మొత్తం 335.16 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 7892.76 క్యూసెక్కుల  వరద నీరు మూసి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది.

ఆశాజనకంగా సెప్టెంబర్

మొత్తానికి జూలై ఆగస్టు నెలలతో పోలిస్తే సెప్టెంబర్ నెల ఆశాజనకం గానే ప్రారంభం అయిందని చెప్పవచ్చు మరిన్ని అల్పపీడనాలు ఏర్పడి మరింతగా వర్షపాతం నమోదు కావాలని పంటలు ఎండిపోకుండా వరుణుడు కరుణించాలని రైతన్నలతో పాటు మనము కోరుకుందాం