మరో మారు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిన- ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

మరో మారు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిన- ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
  • నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు
  • అభ్యర్థులు ఎవరో తేలక సతమతమవుతున్న విపక్ష పార్టీలు
  • నియోజకవర్గంలో ఏకపక్షంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే ప్రచార పర్వం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష జోరుగా కొనసాగుతోంది. విపక్ష పార్టీల అభ్యర్థి ఎవరో తేలక ముందే ఆయా పార్టీల నాయకులు ముఖ్య కార్యకర్తలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ అనునిత్యం గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలుకుతున్నారు. నాయకులు కార్యకర్తలు పార్టీని వీడుతున్న తీరు పట్ల విపక్ష కాంగ్రెస్ ,బిజెపి లో కొంతమేర ఆందోళన గురవుతున్నట్లు సమాచారం తమ పార్టీ అభ్యర్థులు ఎవరో తేలేదాకా అధికార పార్టీ దూకుడుఏకపక్షంగా కొనసాగవచ్చు అని అంటున్నారు .విపక్ష కాంగ్రెస్ బిజెపిలు తమ పార్టీల అభ్యర్థులు ఎవరో తెలియక పార్టీని వీడి పోయేవారిని  నిలువరించ లేక పోతున్నారని సమాచారం .

ముఖ్యంగా  బిఆర్ఎస్ ప్రధాన పోటీగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీలో డజన్ల కు పైగా ఆశావహులు ఉన్నారు .తాము ముందు పడి పార్టీని కాపాడితే తీరా టికెట్ల పంపిణీలో తమకు టికెట్ దగ్గక పోతే పరిస్థితి ఏంటని తమ శ్రమ ఇంకొకరికి లాభం చేకూరుతుందని ఆలోచనతోనే కాంగ్రెస్ నేతలు టికెట్ల కోసం తమ గాడ్ ఫాదర్ ల చుట్టూ హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు సమాచారం .నియోజకవర్గంలో  బిఆర్ఎస్ పార్టీ రెండోసారి విజయం సాధించిన తర్వాత విపక్ష పార్టీల సర్పంచులు ,ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు .ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అభ్యర్థి ఎవరు అనే విషయం తేట తెల్లం కావడం  బిఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. దీంతో మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే 
యోచనతో ఎమ్మెల్యే ఎన్నికల ముందు మరో మారు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారు.

అంతేగాక ఇటీవల జరిగినది  బిఆర్ఎస్ బహిరంగ సభ తో ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. సభ ద్వారా అభ్యర్థి ఎంపిక అలాగే బిఆర్ఎస్ భారీ బల ప్రదర్శన రెండు ఏకకాలంలో నిర్వహించి రాజకీయ వేడిని సృష్టించారు . సభ తర్వాత ఎమ్మెల్యే తన దూకుడు మరింత పెంచారు .నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ  గ్రామాల్లో చిన్న చితికా కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలతో మమేక మవుతున్నారు  . ఆపదలో ఉన్నవారికి తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు సాగు తున్నారు .ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రచారం ఏక పక్షంగా కొనసాగుతోంది.  ఇందుకు ప్రధాన కారణం విపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరో తెలియకపోవడమే.  ఒకవేళ ప్రకటించిన ఆయా పార్టీలలో నిరాశతో తమకు సీటు దక్కలేదు అన్న వ్యతిరేకతతో అధికార పార్టీకి మద్దతు ఇవ్వ వచ్చేమోనని లేక గతంలో మాదిరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా పలువురు  వ్యాఖ్యానిస్తున్నారు.  

ఏది ఏమైనా నియోజకవర్గంలో గత రెండుసార్లు మాదిరిగానే  బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రచార పర్వాన్ని తనదైన శైలిలో నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు . విపక్ష పార్టీల అభ్యర్థుల పేర్లు తేలిన తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో  బిఆర్ఎస్ పార్టీ దూకుడు ఏ విధంగా కట్టడి చేస్తారు వేచి చూడాల్సిందే.