నోవాటెల్​లో ఏం జరిగింది?

నోవాటెల్​లో ఏం జరిగింది?
  • బీఆర్ఎస్​, బీజేపీ దోస్తానాపై హాట్ హాట్ చర్చ
  • పాదయాత్ర ఖర్చులపైనా సీరియస్ వార్నింగ్​ 
  • ఇంతటి విభేదాలు ఎందుకు వచ్చాయి?
  • పార్టీ ఎందుకంత డీలా పడిందంటూ ప్రశ్నించిన నడ్డా
  • సమాధానాలు చెప్పలేకపోయిన స్టేట్​ లీడర్లు
  • ఆర్ఎస్ఎస్​ కీలక నేత వ్యవహారంపైనా చర్చ


ముద్ర, తెలంగాణ బ్యూరో:

బీజేపీ రాష్ట్ర కోర్​కమిటీ సమావేశం చాలా ప్రశ్నలను ముందుకు తెచ్చింది. నోవాటాల్ హోటల్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఈ మీటింగ్​లో రాష్ట్ర పార్టీలోని నేతలంతా బీజేపీ జాతీయ నాయకత్వం ముందు పలు విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. నడ్డా కూడా అదే స్థాయిలో రాష్ట్ర నేతల వైఖరిని తప్పు పడుతూ, ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అర్థరాత్రి వరకు సాగిన ఈ సమావేశం హాట్ హాట్​గా సాగింది. రాష్ట్రంలో ఒక్కసారిగా ఎగిసిన పార్టీ స్వయంకృతాపరాధం కారనంగానే ఢీలా పడిందని అటు జాతీయ నాయకత్వం, ఇటు రాష్ట్ర నేతలు అంగీకరించినట్లు సమాచారం. కేసీఆర్ పై ప్రధాని విమర్శలు చేసినా రాష్ట్ర జనం నమ్మడం లేదని, బీఆర్ఎస్​కు బీ టీమ్ గానే బీజేపీ వ్యవహరిస్తుందనే అపవాదును మూటగట్టుకుంటున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. 

నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల సమావేశం తర్వాత రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని శంషాబాద్​లోని నోవాటెల్ హోటల్​లో నిర్వహించారు. కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై నిర్వహించిన మీటింగ్​ కావడంతో పార్టీ నేతలంతా తమ అభిప్రాయాలను నడ్డా ముందుంచారు. వాటికి సమాధానాలు చెబుతూనే నడ్డా కూడా ఎదురుప్రశ్నలు సంధించడంతో ఈ సమావేశంలో చాలా ఉత్కంఠగా జరిగిందని పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్​ అవినీతి, అక్రమాలపై మాట్లాడుతున్నామే తప్ప, వాటిని నిరూపించలేకపోతున్నామని, కవిత విషయంలోనూ అలాగే జరిగిందని కొందరు నడ్డా దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ఇప్పటి పరిస్థితులు అనుకూలించవని నడ్డాకు నివేదించారంటున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఒక్కసారిగా దూకుడు తగ్గించడం, విమర్శలు మానుకోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికే పరిమితమవడంతో ప్రజలలో కూడా ఈ రెండు పార్టీల మధ్య స్నేహబంధం ఉందని నమ్ముతున్నారనే చర్చ జరిగిందంటున్నారు. కాంగ్రెస్​ప్రచారంతో పార్టీ నేతలపై ఒత్తిడి పెరిగిందని వివరించారంటున్నారు. ధరణిపై పార్టీ  స్థాండ్ స్పష్టం చేయలేదని, ఓసారి సవరిస్తామని, మరోసారి రద్దు చేస్తామనే ప్రకటనతో ఆయోమయంగా మారిందని, దీనిపై గ్రామాలలోనూ ఏం చెప్పలేని పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఢిల్లీ లిక్కర్​ కేసులో కవిత జైలుకు వెళ్లకపోవడంతో కూడా ప్రజలు కూడా బీజేపీ, బీఆర్ఎస్​ఒక్కటేననే ప్రచారాన్ని నమ్మే పరిస్థితులున్నాయని వివరించారని తెలిసింది. 

అసలు మీరేం చేస్తున్నారు?

రాష్ట్ర నేతల నుంచి ఫిర్యాదులు, అభిప్రాయాలను విన్న అనంతరం నడ్డా పార్టీ వ్యవహారం రోడ్డెక్కిందని, పార్టీ నేతలు లైన్​ తప్పారని, అంతర్గత అంశాలు బహిరంగమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇదే సమయంలో కొందరు లీడర్లు ప్రజా సంగ్రామ పాదయాత్ర సందర్భంగా చేసిన వసూళ్ల వ్యవహారంపై మాట్లాడారు. దీంతో నడ్డా కూడా సీరియస్​ అయ్యారు. వసూళ్ల మీద ఆర్ఎస్ఎస్​కీలక నేత ఇచ్చిన ఫిర్యాదు కీలకమని, వందల కోట్లు వసూలు చేశారనే ఆరోపణలున్నాయని, దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం వసూలు చేసిన వర్గానికి ఉందని హెచ్చరించారని తెలిసిందవి. నేతల మధ్య సమన్వయం లేదని, బీజేపీలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదని, ఈ పరిస్థితులు పార్టీని రాష్ట్రంలో డీలా పడేసినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రఘునందన్​రావు చేసిన బహిరంగ విమర్శలు సైతం చర్చకు వచ్చాయి. బండి సంజయ్ తన పాదయాత్ర కోసం భారీగా డబ్బులు వసూలు చేశారనే విషయాలపై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు ఉందని నడ్డా చెప్పినట్లు తెలిసింది. ఈ వసూళ్ల విషయంలోనే నేతల మధ్య గొడవలు వచ్చాయని, పార్టీ టికెట్​ ఆశించిన వారు కూడా కోట్లు ఇచ్చారనే విమర్శలు వచ్చాయని, ఇలాంటి అంతర్గతమైన అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దంటూ నడ్డా చురకలంటించారని చెబుతున్నారు. ఇదే అంశంపై కూడా తరుణ్​చుగ్​, సునీల్​ బన్సల్ ను కూడా నడ్డా ప్రశ్నించినట్లు తెలిసింది. పాదయాత్రకు పార్టీ ఢిల్లీ నుంచి  రూ.37 కోట్లు పంపించిన తర్వాత ఇక్కడెందుకు వసూళ్లు చేశారని నడ్డా ప్రశ్నించారని సమాచారం. 37 కోట్లకు బిల్లులు ఇచ్చారని, కానీ, వందల కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయని, వీటన్నింటిపైనా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యనేతలంతా పాదయాత్రలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఆగస్టు నుంచి పాదయాత్రలు చేయాలని దిశానిర్ధేశం చేవారు. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ పాదయాత్రలకు ఖర్చు పార్టీ భరిస్తుందని, ఎక్కడా వసూళ్లు చేశారనే ఫిర్యాదు రావద్దని పదేపదే హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెప్పారు.